'శుబ్‌మన్‌ గిల్‌ కూడా అలాంటివాడే.. అతడికి తిరుగు లేదు' | Sanjay Manjrekar lauds Shubman Gill’s heroic knock in IND vs ENG 1st ODI | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'శుబ్‌మన్‌ గిల్‌ కూడా అలాంటివాడే.. అతడికి తిరుగు లేదు'

Published Fri, Feb 7 2025 12:07 PM | Last Updated on Fri, Feb 7 2025 12:25 PM

Sanjay Manjrekar lauds Shubman Gill’s heroic knock in IND vs ENG 1st ODI

నాగ్‌పూర్ వేదిక‌గా ఇంగ్లండ్‌(England)తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్(Shubman Gill) అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 249 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో గిల్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్ వ‌చ్చిన గిల్ తొలుత ఆచితూచి ఆడాడు. 

ఆ త‌ర్వాత ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి భార‌త స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. 96 బంతుల్లో 87 పరుగులు చేసి భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ నేప‌థ్యంలో శుబ్‌మ‌న్ గిల్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ సంజయ్ మంజ్రేకర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.  గిల్ ఒక అద్బుత‌మైన ఆట‌గాడ‌ని, చాలా కాలం పాటు భార‌త క్రికెట్ జ‌ట్టులో కొన‌సాగుతాడ‌ని మంజ్రేకర్ కొనియాడాడు.

"భారత క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగగల క్రికెటర్లకు మేము ఓ పదాన్ని ఉపయోగిస్తాం. ‘లంబీ రేస్‌ కా ఘోడా’(సుదీర్ఘ దూరం పరిగెత్తగల గుర్రం). శుబ్‌మన్‌ గిల్‌ కూడా అలాంటివాడే! అంటూ ఎక్స్‌లో మంజ్రేక‌ర్ రాసుకొచ్చాడు.

ఓపెనింగ్ స్లాట్ త్యాగం..
కాగా ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆట‌గాడు య‌శ‌స్వి జైశ్వాల్ కోసం గిల్ త‌న ఓపెనింగ్ స్ధానాన్ని త్యాగం చేశాడు. విరాట్ కోహ్లి జ‌ట్టులో లేక‌పోవ‌డంతో మూడో స్ధానంలో గిల్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. త‌న బ్యాటింగ్ పొజిషేన్ అది కాన‌ప్ప‌టికి గిల్ మాత్రం ప్రశాంతంగా ఉండి క్రీజులో ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డ్పించాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, అక్ష‌ర్ పటేల్‌తో క‌లిసి విలువైన భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఒకవేళ రెండో వన్డేకు విరాట్‌ కోహ్లి అందుబాటులోకి వస్తే.. గిల్‌ మళ్లీ ఓపెనర్‌గానే బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది.

ఇక ఈ మ్యాచ్ అనంత‌రం త‌న ఇన్నింగ్స్‌పై గిల్ స్పందించాడు. "వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. నా బ్యాటింగ్‌లో కూడా ఎటువంటి మార్పు రాదు. కానీ మైదానంలో నా ఆలోచ‌న‌ల‌ను రోహిత్ భాయ్‌కు షేర్ చేస్తాను. అదే విధంగా రోహిత్ ప్ర‌ణాళ‌కల‌ను కూడా నేను అడిగి తెలుసుకుంటాను.

నా వ్యూహాలను కూడా అతడితో పంచుకుంటున్నాను. మ్యాచ్ గురించి ఏదైనా స‌ల‌హా ఇవ్వాల‌న‌కుంటే, సంకోచించ‌కుండా త‌న‌తో చెప్ప‌మ‌ని రోహిత్ నాతో అన్నాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేష‌న్‌లో గిల్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: కింగ్ వ‌చ్చేస్తున్నాడు.. పాపం అత‌డు! ఒక్క మ్యాచ్‌కే వేటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement