సీఎస్‌కే వైస్‌ కెప్టెన్‌గా అతడే సరైనోడు: అనిల్‌ కుంబ్లే | Sanju Samson To Be Chennai Super Kings Vice Captain? | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే వైస్‌ కెప్టెన్‌గా అతడే సరైనోడు: అనిల్‌ కుంబ్లే

Mar 19 2026 8:46 AM | Updated on Mar 19 2026 11:46 AM

Sanju Samson To Be Chennai Super Kings Vice Captain?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌.. ఇప్పుడు ఐపీఎల్‌-2026లో స‌త్తాచాటేందుకు స‌న్న‌ద్దమ‌వుతున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. ఐపీఎల్‌-19వ సీజ‌న్ వేలానికి ముందు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నుంచి సీఎస్‌కే శాంస‌న్ ట్రేడ్ అయ్యాడు.

అందుకోసం చెన్నై ఫ్రాంచైజీ ర‌వీంద్ర జ‌డేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్‌రౌండ‌ర్ల‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. 11 సీజన్ల పాటు రాజ‌స్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్.. ఇప్పుడు ఎల్లో జెర్సీలో మెరవనున్నాడు.

ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ కెప్టెన్ కుంబ్లే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శాంస‌న్‌ను ట్రేడ్ డీల్‌ను కుంబ్లే స‌మ‌ర్ధించాడు. ఎంఎస్ ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంజూకు అన్ని ర‌కాల అర్హ‌త‌లు ఉన్నాయ‌ని కుంబ్లే అభిప్రాయ‌ప‌డ్డాడు.

"భారత క్రికెట్‌లో సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్‌, ఆపై ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి వరకు వారసత్వం ఎలా కొనసాగిందో.. ఇప్పుడు ధోని నుంచి ఆ బాధ్యతను శాంసన్ అందుకోబోతున్నాడు. సంజూను జట్టులోకి తీసుకోవడం సీఎస్‌కే వ్యూహత్మక నిర్ణయంగా చెప్పుకోవాలి. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనక కూడా బాధ్యతలు నిర్వర్తించగలడు. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు అదే జోరును సీఎస్‌కే తరపున కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతడి రాకతో సీఎస్‌కే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగనుంది.

 సీఎస్‌కే వైస్ కెప్టెన్సీ రోల్‌కు సంజూ సరిగ్గా సరిపోతాడు. అతడికి కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో జడేజా కెప్టెన్సీ తప్పుకున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు మళ్ళీ ధోనీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సంజూ రాకతో రుతురాజ్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లీడర్ జట్టుకు దొరికినట్లయింది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.
చదవండి: ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్‌

Advertisement
 
Advertisement
Advertisement