బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–18, 21–14తో 2019 చాంపియన్ జోడీ మొహమ్మద్ అసన్–హెండ్రా సెతియావాన్ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2022 విజేత జోడీ మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–బగాస్ మౌలానా (ఇండోనేసియా)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది.
లక్ష్య సేన్ బోణీ
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 2022 రన్నరప్, భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 21–14తో ప్రపంచ 33వ ర్యాంకర్ మాగ్నస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్‌కు నిరాశ ఎదురైంది. చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్షు 19–21, 21–11, 9–21తో ఓడిపోయాడు.
మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ముందంజ వేయగా... గత ఏడాది సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఈసారి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–18తో యెంగ్ ఎన్గా టింగ్–యెంగ్ పుయ్ లామ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గింది. గాయత్రి–ట్రెసా జోడీ 18–21, 12–21తో అప్రియాని రహాయు–సితీ ఫాదియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment