తన పేరిట జరుగుతున్న దుష్ప్రచారంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా స్పందించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తనకు ఎటువంటి ఖాతా లేదని స్పష్టం చేసింది. కొంతమంది కావాలనే డీప్‌ఫేక్ ఫొటోలతో తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలాంటి ఫేక్ అకౌంట్లను వెంటనే తొలగించాలని ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు సారా విజ్ఞప్తి చేసింది. కాగా సచిన్ తనయగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న తపనతో సారా టెండుల్కర్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఈ క్రమంలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలు అభిమానులతో పంచుకోవడం ఆమెకు అలవాటు. అయితే, ఎక్స్(ట్విటర్)లోనూ సారా టెండ్కులర్ పేరిట బ్లూ టిక్‌తో ఓ అకౌంట్ ఉంది.
పేరడి అకౌంట్‌గా పేర్కొన్న ఈ ఖాతాలో సారా ఫొటోలు షేర్ చేయడమే గాకుండా.. టీమిండియా క్రికెటర్ శుబ్‌మన్ గిల్ పట్ల ఆమెకు ప్రత్యేక శ్రద్ధగా ఉన్నట్లుగా కొన్నిరోజులుగా పోస్టులు పెడుతున్నారు. వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియాను సపోర్టు చేస్తూ సారా స్టేడియాలకు వెళ్లిన విషయం తెలిసిందే. గిల్‌తో ఆమె ప్రేమలో ఉందన్న వదంతులకు ఇలాంటి ఘటనలు మరింత బలాన్నిచ్చాయి.
ఈ నేపథ్యంలో సారా పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో గిల్‌కు ఆమె విషెస్ చెబుతున్నట్లు.. అతడు అవుటైన సందర్భాల్లో బాధ పడిటన్లు పోస్టులు పెట్టారు. ఇక మరో ఖాతాలో తన తమ్ముడు అర్జున్‌తో సారా ఉన్న ఫొటోల్లో గిల్ ముఖంతో మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కలత చెందిన సారా టెండుల్కర్ ఇన్‌స్టా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మన సంతోషాలు, బాధలు.. రోజూవారీ కార్యకలాపాలు అభిమానులతో పంచుకోవడానికి దొరికిన ఒక అద్భుత మాధ్యమం సోషల్ మీడియా.
కానీ కొంతమంది సాంకేతికను దుర్వినియోగం చేస్తూ అభూత కల్పనలతో ఇంటర్నెట్‌ను నింపేస్తున్నారు. నాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ ఫొటోలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ వాస్తవదూరాలు.
అంతేకాదు ఎక్స్‌లో నా పేరిట ఖాతా తెరిచి ప్రజలను తికమకకు గురిచేస్తున్నారు. నిజానికి నాకు ఎక్స్ ఖాతా లేనేలేదు. ఇలాంటి అకౌంట్లను పరిశీలించి వాటిని నిషేధిస్తారని భావిస్తున్నా.
నిజాన్ని దాచి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా వినోదం అందించాల్సిన అవసరం లేదు. నమ్మకం, వాస్తవాల ఆధారంగా నడిచే కమ్యూనికేషన్‌ను ఎంకరేజ్ చేద్దాం’’ అని సారా పేర్కొంది. కాగా ఇటీవలి కాలంలో డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో దుమారం రేపగా.. కత్రినా కైఫ్, కాజోల్ వంటి నటీమణులకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తాంటూ కేంద్రం హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment