
T20 World Cup Warm Up Matches NET VS SCO: టీ20 వరల్డ్‌కప్-2022కు సన్నాహకాలైన వార్మప్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచే మొదలయ్యాయి. ఇవాళ తొలుత వెస్టిండీస్-యూఏఈ జట్లు తలపడగా.. ఆ మ్యాచ్‌లో విండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్-స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడ్డ నెదర్లాండ్స్ 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెర్రింగ్టన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు), లీస్క్ (21 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. మిగిలిన వారంతా నామమాత్రపు స్కోర్‌కు పరిమితమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లు బ్రాండన్ గ్లోవర్ (3/17), బాస్ డీ లీడ్ (3/20) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఛేదనలో నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్ స్టెఫాన్ మైబుర్గ్ (4) వికెట్ కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (35 బంతుల్లో 43), విక్రమ్‌జీత్ సింగ్ (31) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడం, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు సాధించలేకపోవడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ 2, జోష్ డేవీ, మార్క్ వ్యాట్, క్రిస్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (అక్టోబర్ 11) శ్రీలంక-జింబాబ్వే, నమీబియా-ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ అనధికారిక మ్యాచ్‌లు అక్టోబర్ 19 వరకు సాగనున్నాయి.