ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్‌ | Scotland Earn Maiden ICC Women's T20 World Cup Berth | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్‌

Published Mon, May 6 2024 11:44 AM | Last Updated on Mon, May 6 2024 12:10 PM

Scotland Earn Maiden ICC Women's T20 World Cup Berth

స్కాట్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నిన్న (మే 5) జరిగిన క్వాలిఫయర్‌ సెమీస్‌లో స్కాట్లాండ్‌ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 2015 నుంచి వరల్డ్‌కప్‌ బెర్త్‌ కోసం తపిస్తున్న స్కాట్లాండ్‌ ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) అనుకున్నది సాధించింది. 

మరో సెమీస్‌లో యూఏఈని ఓడించిన శ్రీలంక కూడా స్కాట్లాండ్‌తో పాటు వరల్డ్‌కప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్‌ పోటీల నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. 

 టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్‌, పాక్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో కలిసి గ్రూప్‌-ఏలో.. స్కాట్లాండ్‌.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్‌-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.

 గ్రూప్‌ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్‌ రెండు జట్లు అక్టోబర్‌ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్‌ 20న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న జరుగనుంది.

స్కాట్లాండ్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ (తొలి సెమీస్‌) విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. స్కాట్లండ్‌ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేథరీన్‌  బ్రైస్‌ ఆల్‌రౌండ్‌ షోతో (4-0-8-4, 35 నాటౌట్‌) ఇరగదీసి స్కాట్లాండ్‌ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది.

రెండో సెమీస్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన యూఏఈ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. మే 7న జరిగే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌లో స్కాట్లండ్‌, శ్రీలంక అమీతుమీ తేల్చుకుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement