స్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్(Alasdair Evans) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగించేందుకు సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ఈ సందర్భంగా ఇవాన్స్ కృతజ్ఞతలు తెలిపాడు.
అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. కాగా 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్ స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ పేస్ బౌలర్ 58, 41 వికెట్లు తీశాడు.
చివరగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక తరఫున మ్యాచ్ ఆడాడు. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన అతడు..తాజాగా ఆటకు వీడ్కోలు పలుకుతూ ప్రకటన విడుదల చేశాడు.
ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా
‘‘నా అరంగేట్రం గురించి ఇప్పటికీ ప్రతీ విషయం గుర్తుంది. ఆరోజు అబెర్డీన్‌లో మ్యాచ్. హెడ్‌కోచ్ పీట్ స్టెయిన్డిల్ నుంచి రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. నువ్వు రావాల్సి ఉంటుందని చెప్పారు.
నేను కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుతానని ఊహించలేదు. అందుకే నాకు హెడ్‌కోచ్ కాల్ చేసినపుడు ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా. నా ప్రయాణంలో అద్భుతమైన క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కింది. పదిహేనేళ్లు జట్టుతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు’’ అని ఇవాన్స్ పేర్కొన్నాడు.
చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
Comments
Please login to add a commentAdd a comment