Senior Team India Cricketers Could Be Rested For New Zealand T20I Series: టీ20 ప్రపంచకప్ ముగిసిన వారం వ్యవధిలో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియాలో భారీ మార్పులు జరిగే ఆస్కారముందని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. నవంబర్ 17, 19, 21 తేదీల్లో జరిగే ఈ టీ20 సిరీస్ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించి ఐపీఎల్‌లో రాణించిన వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్‌లకు అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి టీమిండియా సీనియర్ సభ్యులు వరుసగా బయోబబుల్‌లో ఉండడమే ఈ మార్పులు చేర్పులకు కారణమని తెలుస్తోంది.
డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో సీనియర్లకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ సైతం సెలెక్షన్ కమిటీకి సిఫార్సు చేసినట్లు సమాచారం. మరోవైపు టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రవిశాస్త్రి స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించేందుకు కూడా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇదంతా కార్యరూపం దాల్చితే న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో ద్రవిడ్ ఆధ్వర్యంలో ఐపీఎల్ సూపర్ హీరోస్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయమేనని విశ్లేషకుల అంచనా. ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్‌కు భారత్ ఆతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇరు జట్లు 3 టీ20లు, 2 టెస్ట్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి.
చదవండి: టీ20 క్రికెట్‌కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను
Comments
Please login to add a commentAdd a comment