లక్నోకు షాక్‌.. స్టార్‌ పేసర్‌ సీజన్‌ మొత్తానికి దూరం | Setback For LSG, Star Indian Pacer Ruled Out Of IPL 2024 Due To Injury | Sakshi
Sakshi News home page

IPL 2024: ఆరు కోట్లు పెట్టి కొన్న పేసర్‌ సీజన్‌ మొత్తానికి దూరం

Published Wed, Apr 3 2024 4:07 PM | Last Updated on Wed, Apr 3 2024 4:27 PM

Setback For LSG Star Indian Pacer Ruled Out Of IPL 2024 Due To Injury - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (PC: BCCI)

IPL 2024- LSG pacer to pull out of tournament  ఆర్సీబీపై గెలుపుతో జోష్‌లో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోట్లు ఖర్చు పెట్టి కొన్న ఫాస్ట్‌ బౌలర్‌ ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు పదిహేడో ఎడిషన్‌కు అందుబాటులో ఉండటం లేదు.

అతడు మరెవరో కాదు టీమిండియా పేసర్‌ శివం మావి. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా అతడు ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ నుంచి వైదొలిగాడు. ఇందుకు సంబంధించి లక్నో ఫ్రాంఛైజీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.  

‘‘దురదృష్టవశాత్తూ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు శివం మావి.. గాయం కారణంగా ఐపీఎల్‌-2024 మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిభావంతుడైన ఈ కుడిచేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌ డిసెంబరులో జరిగిన వేలం సందర్భంగా మాతో చేరాడు. ప్రీ సీజన్‌ క్యాంపులోనూ పాల్గొన్నాడు.

ఈ సీజన్‌లో అతడు జట్టులో కీలక సభ్యుడిగా ఉంటాడనుకున్నాం. కానీ ఇలా జరగడం అతడిని కూడా నిరాశ పరిచింది. ఏదేమైనా ఫ్రాంఛైజీ ఎల్లవేళలా శివంకు అండగా ఉంటుంది.

గాయం నుంచి కోలుకునే క్రమంలో అతడికి కావాల్సిన సహాయం అందిస్తుంది. త్వరగా కోలుకుని అతడు మరింత స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాలని కోరుకుంటున్నాం’’ అని లక్నో యాజమాన్యం శివం మావిని విష్‌ చేసింది.

కేకేఆర్‌, గుజరాత్‌ జట్లకు ఆడి
కాగా 2018లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన యూపీ పేసర్‌ శివం మావి.. 2022 వరకు కేకేఆర్‌కే ఆడాడు. అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ అతడిని ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. 2022లో గుజరాత్‌ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీశాడు.

ఈ క్రమంలో గతేడాది జనవరిలో టీమిండియాలో అడుగుపెట్టి ఇప్పటి వరకు ఆరు టీ20లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్‌-2023లో గుజరాత్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన శివం మావిని ఫ్రాంఛైజీ వదిలేసింది.

ఆవేశ్‌ ఖాన్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు
ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతడి కోసం 6.4 కోట్ల రూపాయలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. ఆవేశ్‌ ఖాన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు వెళ్లిపోయిన నేపథ్యంలో అతడి స్థానాన్ని శివంతో భర్తీ చేసింది. ఇదిలా ఉంటే.. రూ. 20 లక్షలతో లక్నో కొనుగోలు చేసిన మయాంక్‌ యాదవ్‌ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో లక్నో రెండు గెలిచింది.

చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement