Shakib Al Hasan Banned For Three Matches For Outburst In Bangladesh Tournament - Sakshi
Sakshi News home page

షకీబ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం 

Published Sun, Jun 13 2021 12:22 PM | Last Updated on Sun, Jun 13 2021 12:53 PM

Shakib Al Hasan Gets Three Match Ban - Sakshi

ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా శుక్రవారం అబహాని లిమిటెడ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దురుసు ప్రవర్తనతో తీవ్ర విమర్శలపాలైన ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌పై (మొహ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌) బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చర్య తీసుకుంది. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో అతనిపై మూడు మ్యాచ్‌ల నిషేధంతోపాటు 5 లక్షల టాకాలు (సుమారు రూ. 4.25 లక్షలు) జరిమానా విధించింది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా మొహమ్మదాన్, అబహాని జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తాను బౌలింగ్‌ చేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి ముష్ఫికర్‌ రహీమ్‌ ఎల్బీడబ్ల్యూ కోసం షకీబ్‌ అప్పీల్‌ చేయగా, అంపైర్‌ దానిని తిరస్కరించాడు.

దాంతో వెనక్కి తిరిగి కాలితో స్టంప్స్‌ను తన్ని పడగొట్టిన షకీబ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. తర్వాతి ఓవర్‌ ఐదో బంతి తర్వాత చినుకులు ప్రారంభం కావడంతో అంపైర్‌ ఆటను నిలిపేసి కవర్లు తీసుకురమ్మని సైగ చేశాడు. తన ఫీల్డింగ్‌ స్థానం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన షకీబ్‌ మూడు స్టంప్స్‌ను కూడా ఊడబీకి కిందకు విసిరికొట్టాడు. ఆట ఆపేంత వర్షం రావడం లేదు కదా అని అసహనం ప్రదర్శించిన అతను ఆ తర్వాత కింద నుంచి స్టంప్స్‌ను తీసుకొని మళ్లీ అంపైర్‌ కాళ్ల దగ్గర పడేశాడు. షకీబ్‌ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement