అందుకే నాపై వేటు వేశారు.. చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో నో ప్లేస్‌! | Got Dropped Because: Bangladesh Batter Litton Das On CT 2025 Snub | Sakshi
Sakshi News home page

అందుకే నాపై వేటు వేశారు.. చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో నో ప్లేస్‌!

Jan 13 2025 2:25 PM | Updated on Jan 13 2025 2:47 PM

Got Dropped Because: Bangladesh Batter Litton Das On CT 2025 Snub

స్టార్‌ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌తో పాటు సీనియర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 కోసం ప్రకటించిన బంగ్లాదేశ్‌ జట్టులో వీరికి చోటు దక్కలేదు. షకీబ్‌ విషయానికొస్తే.. సందేహాస్పద బౌలింగ్‌ యాక్షన్‌ కారణంగా సస్పెన్షన్‌కు గురైన అతడిని సెలెక్టర్లు ఈ ఐసీసీ టోర్నీకి పరిగణించలేదు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల షకీబ్‌... చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి కూడా తప్పుకొంటానని ఇదివరకే వెల్లడించాడు.

అయితే, తాజాగా బంగ్లాదేశ్‌ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో షకీబ్‌ అంతర్జాతీయ కెరీర్ ఇక‌ ముగిసినట్లే. షకీబ్‌తో పాటు ఫామ్‌లేక తంటాలు పడుతున్న సీనియర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌కు కూడా నిరాశే ఎదురైంది. గత 13 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా సాధించని లిటన్‌ దాస్‌... గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 1, 0, 0, 2, 4, 0 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు.

అందుకే నాపై వేటు వేశారు
ఈ విషయంపై స్పందించిన లిటన్‌ దాస్‌ తనపై వేటు పడటానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘గతంలో నేను ఎన్నెన్నో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాను. అయితే, ఇప్పుడు జీరో నుంచి మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఇకపై మరింత కఠినంగా శ్రమించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.

అయినా, చాంపియన్స్‌ ట్రోఫీ జట్టు ఎంపికకు ముందే నాకొక స్పష్టమైన సందేశం వచ్చింది. అయితే, సెలక్టర్ల నుంచి నేరుగా రాలేదు. కానీ.. ఈ జట్టులో చోటు దక్కదని తెలుసు. నేను బాగా ఆడటం లేదు కాబట్లే నన్ను టీమ్‌ నుంచి తప్పించారు. ఇందులో దాచాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అందరి విషయంలోనూ సాధారణంగా జరిగేదే ఇది.

కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభిస్తా
ఏదేమైనా నేను నా ఆటను మెరుగుపరచుకోవాల్సి ఉంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు గానీ.. నేను మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయను. అయినా... నేను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నిలకడైనా ఆట తీరుతో కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభిస్తా’’ అని 30 ఏళ్ల లిటన్‌ దాస్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా గతనెల(డిసెంబరు 2024)లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లిటన్‌ దాస్‌ బంగ్లాదేశ్‌కు చివరగా ఆడాడు.

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం
కాగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్‌ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు నజ్ముల్‌ హుసేన్‌ షాంటో సారథ్యం వహిస్తుండగా... ముష్ఫికర్‌ రహీం, మహ్ముదుల్లా, ముస్తాఫిజుర్‌ వంటి సీనియర్‌ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. కాగా పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.

ఇక చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్‌.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్‌-‘బి’లో ఉంది. మరోవైపు.. టీమిండియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా గ్రూప్‌-‘ఎ’ నుంచి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఫిబ్రవరి 20న దుబాయ్‌ వేదికగా టీమిండియాతో తలపడనుంది.

తదుపరి.. రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్‌తోనూ బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ టోర్నీలో మార్చి 4న తొలి సెమీఫైనల్‌ దుబాయ్‌లో జరుగనుండగా.. మార్చి 5న రెండో సెమీ ఫైనల్‌కు లాహోర్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 9న ఫైనల్‌ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు కాగా.. మార్చి 10 రిజర్వ్‌ డేగా ఖరారు చేశారు..

బంగ్లాదేశ్‌ జట్టు: 
నజ్ముల్‌ హుసేన్‌ షాంటో (కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీమ్, తౌహిద్‌ హృదయ్, సౌమ్య సర్కార్, తాంజిద్‌ హసన్, మహ్ముదుల్లా, జాకీర్‌ అలీ, మెహదీ హసన్‌ మిరాజ్, రిషాద్‌ హుసేన్, తస్కీన్‌ అహ్మద్, ముస్తఫిజుర్‌ రహమాన్, పర్వేజ్‌ హుసేన్, నసుమ్‌ అహ్మద్, తన్జిమ్‌ హసన్, నహిద్‌ రాణా.

చదవండి: ఇదెక్కడి ఫామ్‌ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement