స్వదేశంలోనే షకీబ్‌ వీడ్కోలు | Shakib set for Test farewell at home, part of Bangladesh squad vs SA | Sakshi
Sakshi News home page

స్వదేశంలోనే షకీబ్‌ వీడ్కోలు

Published Thu, Oct 17 2024 8:40 AM | Last Updated on Thu, Oct 17 2024 9:37 AM

Shakib set for Test farewell at home, part of Bangladesh squad vs SA

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ఎంపికైన బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌

ఢాకా: సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు సొంతగడ్డపై వీడ్కోలు పలకాలనుకున్న బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కోరిక నెరవేరనుంది. ఇటీవల భారత్‌తో రెండో టెస్టు సందర్భంగా స్వదేశంలో చివరి మ్యాచ్‌ ఆడి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని షకీబ్‌ ప్రకటించాడు. అయితే బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై అనుమానాలు రేకెత్తగా... ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో షెడ్యూల్‌ ప్రకారం సిరీస్‌ జరగనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈనెల 21 నుంచి మొదలయ్యే తొలి టెస్టు కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం జట్టును ప్రకటించింది. అందులో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు చోటు దక్కింది. 

బంగ్లాదేశ్‌లో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటున్న షకీబ్‌... చివరి మ్యాచ్‌ కోసం స్వదేశానికి రావాలనుకుంటున్నట్లు గతంలోనే వెల్లడించగా... భద్రత కల్పంచలేమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. షకీబ్‌ రాజకీయ వైఖరి వెల్లడిస్తే భద్రత కలి ్పస్తామని... తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా సలహాదారుడిగా పనిచేస్తున్న ఆసిఫ్‌ మహమూద్‌ ప్రకటించగా... స్వదేశంలో హింస తలెత్తిన సమయంలో నోరు మెదపకుండా ఉన్నందుకు షకీబ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ‘అల్లర్లలో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతున్నా. హింస ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించరాదు. 

అయినవాళ్లను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. మీ మనోభావాలను గౌరవిస్తూ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. త్వరలో స్వదేశంలో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాలనుకుంటున్నా. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలుస్తూ... నేను బాగా ఆడినప్పుడు కేరింతలు కొట్టి, బాగా ఆడనప్పుడు కళ్ల నీళ్లు పెట్టుకున్న అందరి ముందు ఆఖరి ఆట ఆడాలనుకుంటున్నా. మీ ప్రేమాభిమానులు కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని షకీబ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. 

దీంతో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం షకీబ్‌కు భద్రత కల్పించేందుకు ముందుకు రాగా... తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బోర్డు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్‌... వచ్చే ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పనున్నాడు. తాజాగా భారత్‌లో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన బంగ్లాదేశ్‌... సఫారీలపై సత్తా చాటాలని చూస్తోంది. టీమిండియాతో ఆడిన జట్టు నుంచి ఖాలెద్‌ అహ్మద్‌ను తప్పించడం తప్ప మిగిలిన జట్టులో మార్పులు చేయలేదు.  

తొలి టెస్టుకు బంగ్లాదేశ్‌ జట్టు: నజ్ముల్‌ షంటో (కెపె్టన్‌), షాద్‌మన్‌ ఇస్లామ్, మహ్ముదుల్‌ హసన్‌ జాయ్, జాకీర్‌ హసన్, మోమినుల్‌ హక్, ముష్ఫికర్‌ రహీమ్, షకీబ్‌ అల్‌ హసన్, లిటన్‌ దాస్, జాకీర్‌ అలీ, మెహిదీ హసన్‌ మిరాజ్, తైజుల్‌ ఇస్లామ్, నయీమ్‌ హసన్, తస్కీన్‌ అహ్మద్, హసన్‌ మహమూద్, నహీద్‌ రాణా.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement