న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో గాయపడి ఐపీఎల్ 2021 మొదటి దశకు పూర్తిగా దూరమైన శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. యూఏఈ వేదికగా జరుగనున్న రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు వెల్లడించాడు. కాగా, గత సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్.. గాయంతో లీగ్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో జట్టు సారధ్య బాధ్యతలను రిషబ్ పంత్ చేపట్టాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణిస్తుంది. పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను కాదని అయ్యర్‌కు తిరిగి జట్టు పగ్గాలు అప్పజెప్పుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయమై అయ్యర్‌ను ప్రశ్నించగా.. దీనిపై మాట్లాడేందుకు ఆయన అయిష్టత ప్రదర్శించాడు. జట్టు పగ్గాల విషయం తన పరిధిలో లేదని, జట్టు యాజమాన్యం ఆ విషయాన్ని చూసుకుంటుందంటూ మాట దాటవేశాడు.
మరోవైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెన్నెముకగా ఉన్న అయ్యర్ జట్టుకు దూరం కావడంతో ఆ స్థానంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. తాజాగా స్మిత్ కూడా ఐపీఎల్ రెండో దశకు దూరం కానున్నట్లు తెలియడంతో ఢిల్లీ యాజమాన్యం ఆందోళనలో పడింది. అయితే, ఇప్పుడు అయ్యర్ పూర్తిగా కోలుకొని ఫిట్‌గా ఉండటంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. సెప్టెంబర్ 17 నుంచి యూఏఈ వేదికగా మలి దశ ఐపీఎల్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment