![Shubman Gill Rises To Second In Latest ODI Rankings, Just Five Points Behind Top Rank Babar Azam](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/gill.jpg.webp?itok=G42bk0kO)
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) రెండో స్థానానికి ఎగబాకాడు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బాబర్‌కు గిల్‌కు మధ్య రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. గిల్ మరో 6 పాయింట్లు సాధిస్తే బాబర్ ఆజమ్‌కు కిందకు దించి టాప్ ర్యాంక్‌కు చేరుకుంటాడు.
గిల్ రెండో స్థానానికి చేరడంతో అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో స్థానానికి పడిపోయాడు. వచ్చే వారం ప్రకటించే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌కు కూడా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఉన్న రోహిత్‌కు టాప్ ప్లేస్‌లో ఉన్న బాబర్‌కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ప్రస్తుతం బాబర్ ఖాతాలో 786 పాయింట్లు, గిల్ ఖాతాలో 781, రోహిత్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.
ఈ వారం ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయాడు. గత వారం నాలుగో ప్లేస్‌లో ఉన్న కోహ్లి.. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో విఫలం కావడంతో ఆరో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు.
ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ నాలుగో స్థానంలో, హెన్రిచ్ క్లాసెన్ ఐదులో, డారిల్ మిచెల్ ఏడులో, షాయ్ హోప్, రహ్మానుల్లా గుర్భాజ్ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మూడో వన్డే తాజా ర్యాంకింగ్స్ పరిగణలోకి రాలేదు.
వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ అగ్రస్థానానికి నిలబెట్టుకున్నాడు. మహీశ్ తీక్షణ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్జ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది నాలుగో స్థానాన్ని కాపాడుకోగా.. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు.
ఇంగ్లండ్‌తో తాజాగా జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న మొహమ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ ప్లేస్‌కు పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మొహమ్మద్ నబీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment