
క్రికెట్ దిగ్గజాలు లేటు వయసులోనూ రెచ్చిపోతున్నారు. యువ ఆటగాళ్లకు తామేమీ తీసిపోమని పరుగుల వరద పారిస్తున్నారు. దిగ్గజాల కోసం తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మాజీ క్రికెటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరగ్గా ఏకంగా ఏడు సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఒక్కడే 3 సెంచరీలు బాదాడు.
ఇంగ్లండ్ మాజీ ఆటగాడు బెన్ డంక్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, శ్రీలంక మాజీ బ్యాటర్ ఉపుల్ తరంగ, తాజాగా విండీస్ మాజీ ప్లేయర్ లెండిల్ సిమన్స్ తలోసారి శతక్కొట్టారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఒక్క సెంచరీ కూడా నమోదు కానప్పటికీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు, యూసఫ్ పఠాన్, గురుకీరత్ సింగ్, సౌరభ్ తివారి తలో హాఫ్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ పూర్వపు రోజుల గుర్తు చేశాడు.
నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా మాస్టర్స్‌పై విండీస్ మాస్టర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే శతకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 59 బంతుల ఎదుర్కొన్న సిమన్స్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.
విండీస్ ఇన్నింగ్స్ చివర్లో చాడ్విక్ వాల్టన్ (12 బంతుల్లో 38 నాటౌట్; 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్, పెర్కిన్స్ తలో 5 పరుగులు చేయగా.. దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 29, ఆష్లే నర్స్ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్రూగర్, ఎన్తిని తలో 2 వికెట్లు తీయగా.. మెక్ లారెన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. రవి రాంపాల్ 5 వికెట్లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి 44, జాక్ కల్లిస్ 45, జాక్ రుడాల్ఫ్ 39 పరుగులు చేశారు.
హషిమ్ ఆమ్లా (3), అల్విరో పీటర్సన్ (7) లాంటి స్టార్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో శ్రీలంక, భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ నిష్క్రమించాయి. శ్రీలంక, భారత్ తలో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment