
భారత జట్టులో చోటుపై సిరాజ్ వ్యాఖ్య
గుజరాత్ టైటాన్స్ తరఫున సత్తా చాటేందుకు సిద్ధం
బెంగళూరు: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు టీమిండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే ఈ హైదరాబాదీ పేసర్ జాతీయ జట్టులోకి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం అంతగా ఆందోళన చెందడం లేదని, ఐపీఎల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నట్లు అతను చెప్పాడు.
ఐపీఎల్‌లో సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ‘భారత జట్టు ఎంపిక నా చేతుల్లో ఉండదనేది వాస్తవం. నా చేతుల్లో బంతి మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయగలను అనేదే ముఖ్యం. టీమ్ సెలక్షన్ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. అలా చేస్తే నా ఆటపై ప్రభావం పడుతుంది. మున్ముందు ఇంగ్లండ్ పర్యటన, ఆసియా కప్‌లాంటివి ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.
టీమిండియా తరఫున ఆడని సమయంలో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను. సాధారణంగా విశ్రాంతి తక్కువగా దొరుకుతుంది. కానీ ఈసారి మంచి విరామం లభించింది. అందుకే బౌలింగ్, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టా. కొత్త బంతులు, పాత బంతులతో బౌలింగ్ చేశాం. స్లో బంతులు, యార్కర్ల విషయంలో ప్రత్యేక సాధన చేశాను. కొత్తగా నేర్చుకున్న అంశాలను ఐపీఎల్‌లో ప్రదర్శిస్తా’ అని అతను చెప్పాడు.
శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘బెంగళూరు జట్టుకు దూరం కావడం కొంత బాధకు గురి చేసిందనేది వాస్తవం. కోహ్లి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అయితే ఇక్కడా గిల్ సారథ్యంలో చాలా మంచి జట్టుంది. గిల్ కెపె్టన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఎప్పుడూ వారించడు. మేమిద్దరం ఒకే టెస్టుతో అరంగేట్రం చేశాం. వ్యక్తిగతంగా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది’ అని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు.
తమ టీమ్‌లో రబాడ, రషీద్, ఇషాంత్, కొయెట్జీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండటం సానుకూల విషయమని, ఇది అందరిపై ఒత్తిడి తగ్గిస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. గత సీజన్ వరకు ఇదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ షమీతో తనను పోల్చడంపై స్పందిస్తూ... ‘టైటాన్స్ టీమ్ తరఫున షమీ భాయ్ చాలా బాగా ఆడాడు. కీలక సమయాల్లో స్వింగ్‌తో వికెట్లు తీశాడు. నేను కూడా ఆయనలాగే పెద్ద సంఖ్యలో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడితే చాలు.
మొతెరా మైదానంలో కొత్త బంతితో షమీ వికెట్లు తీయడం నేను చూశాను. అదే తరహాలో పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే నా పని’ అని సిరాజ్ చెప్పాడు. టైటాన్స్ కోచ్‌గా ఉన్న మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాతో కలిసి పని చేసేందుకు, ఆయన వద్ద కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment