
శ్రీలంకతో (Sri Lanka) తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 654 పరుగుల రికార్డు స్కోర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరుణుడు మూడో రోజు ఆటకు పలు అంతరాయాలు కలిగించాడు. ఈ రోజు కేవలం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
44/3 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఇవాళ మరో 92 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. దినేశ్ చండీమల్ (63), కుసాల్ మెండిస్ (10) క్రీజ్‌లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్‌లో ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ తలో 7 పరుగులు చేయగా.. కమిందు మెండిస్ 15, కెప్టెన్ ధనంజయ డిసిల్వ 22 పరుగులు చేసి ఔటయ్యారు.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc), మాథ్యూ కుహ్నేమన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నాథన్ లయోన్ ఓ వికెట్ తీశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 518 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీ.. స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిస్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ (57) మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. లబూషేన్ 20, అలెక్స్ క్యారీ 46 (నాటౌట్), వెబ్‌స్టర్ 23, మిచెల్ స్టార్క్ 19 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలరల్లో ప్రభాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో 3 వికెట్లు పడగొట్టారు.
రికార్డుల మోత మోగించిన ఆసీస్ బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు రికార్డుల మోత మోగించారు. ఈ మ్యాచ్‌లో తొలి పరుగుతో స్టీవ్ స్మిత్ టెస్ట్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ టెస్ట్‌ల్లో 35వ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (36) మాత్రమే స్టీవ్ స్మిత్ కంటే అత్యధిక సెంచరీలు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖ్వాజా లేటు వయసులో (38 ఏళ్ల 43 రోజులు) డబుల్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో అతనికి ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన జోస్ ఇంగ్లిస్.. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 21వ ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జట్టు స్కోర్ పరంగానూ ఆసీస్ ఈ మ్యాచ్‌లో రికార్డు సృష్టించింది. ఆసియా పిచ్‌లపై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోర్.
మిచెల్ స్టార్క్ మరో రికార్డు
ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు రెండు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ తొలి వికెట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండో వికెట్‌తో స్టార్క్ మరో రికార్డు సాధించాడు. శ్రీలంక గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్క్ శ్రీలంకలో ఇప్పటివరకు 16.77 సగటున 31 వికెట్లు తీశాడు. గతంలో లంక గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్‌గా వసీం అక్రమ్ ఉన్నాడు. అక్రమ్ లంకలో 20.43 సగటున 30 వికెట్లు తీశాడు.
శ్రీలంకలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్లు..
మిచెల్ స్టార్క్-31
వసీం అక్రమ్-30
రిచర్డ్ హ్యాడ్లీ-27
వకార్ యూనిస్-27
ఇషాంత్ శర్మ-26
Comments
Please login to add a commentAdd a comment