
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఏడు అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి, ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిందు ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు. 150 ఏళ్లకు పైబడిన టెస్ట్ క్రికెట్‌లో కమిందుకు ముందు ఒక్క ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదు.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ (102) చేసిన కమిందు.. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ప్లేస్‌లో బరిలోకి దిగి 100 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో ఘనత కూడ ఉంది. లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వ కూడా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. ధనంజయ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసిన ధనంజయ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ధనంజయ, కమిందు సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసి ఆలౌటైంది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. విశ్వ ఫెర్నాండో (4/48), రజిత (3/56), లహిరు కుమార (3/31) విజృంభించడంతో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
92 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు టీ సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి 430 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధనంజయ, కమిందుతో పాటు కరుణరత్నే (52) కూడా రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment