147 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి..! | SL vs NZ: Kamindu Mendis Surpasses Gavaskar To Equal Shakeel World Record | Sakshi
Sakshi News home page

147 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి.. గావస్కర్‌ను అధిగమించి..

Published Thu, Sep 19 2024 12:43 PM | Last Updated on Thu, Sep 19 2024 3:19 PM

SL vs NZ: Kamindu Mendis Surpasses Gavaskar To Equal Shakeel World Record

శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ కమిందు మెండిస్‌ కెరీర్‌లో ఉత్తమ దశలో ఉన్నాడు. జూలై 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. తాను ఆడిన తొలి ఆరు మ్యాచ్‌లలో యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టులోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్‌ జట్టు శ్రీలంకకు వచ్చింది. ఈ క్రమంలో గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్‌ చేయగా.. టాపార్డర్‌ తేలిపోయింది. దిముత్‌ కరుణరత్నె(2), పాతుమ్‌ నిసాంక(27),  దినేశ్‌ చండిమాల్‌(30) నిరాశపరిచారు.

కమిందు మెండిస్‌ సంచలన శతకం
ఏంజెలో మాథ్యూస్‌(36), కుశాల్‌ మెండిస్‌(50) రాణించగా.. కమిందు మెండిస్‌ శతకంతో చెలరేగాడు. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు సాధించాడు. తద్వారా కమిందు మెండిస్‌ సౌద్‌ షకీల్‌ ప్రపంచ రికార్డును సమం చేశాడు. కెరీర్‌లో వరుసగా తొలి ఏడు టెస్టుల్లో యాభైకి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.

147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది రెండోసారి
147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో పాకిస్తాన్‌ బ్యాటర్‌ సౌద్‌ షకీల్‌ తొలుత ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ కమిందుకే ఈ ఘనత సాధ్యమైంది. ఈ క్రమంలో అతడు టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ను కూడా అధిగమించాడు. గావస్కర్‌, సయీమ్‌ అహ్మద్‌(పాకిస్తాన్‌), బసిల్‌ బుచర్‌(వెస్టిండీస్‌), బర్ట్‌ సచ్లిఫ్‌(న్యూజిలాండ్‌) తమ తొలి ఆరు టెస్టుల్లో 50 ప్లస్‌ స్కోర్లు సాధించారు.

ఐదు వికెట్లతో చెలరేగిన రూర్కీ
ఇక కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు సాధించింది. కమిందు, కుశాల్‌ మెండిస్‌ (68 బంతుల్లో 50; 7 ఫోర్లు) కలిసి ఆరో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. ఇతర ప్లేయర్లలో దినేశ్‌ చండీమల్‌ (30), ఏంజెలో మాథ్యూస్‌ (36), పాథుమ్‌ నిసాంక (27) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు.

ఇక రెండో రోజు ఆటలో టెయిలెండర్లు రమేశ్‌ మెండిస్‌(14), ప్రబాత్‌ జయసూర్య(0), అసిత ఫెర్నాండో(0) పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా 91.5 ఓవర్లలో శ్రీలంక 305 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. కివీస్‌ బౌలర్లలో రూర్కీ ఐదు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ ఒకటి, అజాజ్‌ పటేల్‌ , గ్లెన్‌ ఫిలిప్స్‌ రెండేసి వికెట్లు కూల్చారు. 

కమిందు మళ్లీ మెరిసేనా?
ఇక గురువారం న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. కాగా కమిందు మెండిస్‌ ఇప్పటి వరకు ఆరు టెస్టులు పూర్తి చేసుకుని 695 పరుగులు సాధించాడు. ఏడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన ఈ ఆల్‌రౌండర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు బాదాలని పట్టుదలగా ఉన్నాడు.

చదవండి: చెత్త షాట్‌ సెలక్షన్‌!.. కోహ్లి అవుట్‌.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement