బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ చేతిలో తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభావం పొందిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు సన్నద్దం అవుతోంది. కనీసం మూడో టెస్టులోనైనా విజయం సాధించి తొలి రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది.
అయితే మూడో టెస్టుకు ముందు ఆసీస్‌కు గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు గాయం కారణంగా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనం అయ్యాడు.
ఈ క్రమంలో మూడో టెస్టులో ఆసీస్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఆఖరి రెండు టెస్టులకు ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా గాయాల కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. విధ్వంసకర ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మూడో టెస్టుకు అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వీరిద్దరి పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా సృష్టం చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో కామెరాన్ గ్రీన్ చేతి వేలికి గాయమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే గ్రీన్ జట్టుతో కలిసి భారత్‌కు చేరుకున్నాడు.
ఈ క్రమంలో అతడు బెంగళూరులో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో బ్యాటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాడు. అయితే ఇప్పుడు గ్రీన్ నెట్స్‌లో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకోవాలని ఆసీస్ జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది.
కాగా గతేడాది భారత్ గడ్డపై టీ20 సిరీస్‌లో గ్రీన్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతడిని ఐపీఎల్-2023 మినీ వేలంలో ఏకంగా 17 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు!
Comments
Please login to add a commentAdd a comment