'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి' | RCB Star Jitesh Sharma Opens Up On Missing India’s T20 World Cup Chance And The Heartbreak Of Losing His Father | Sakshi
Sakshi News home page

T20 WC: 'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి'

Mar 12 2026 10:25 AM | Updated on Mar 12 2026 11:49 AM

On Snub From Indias T20 World Cup Squad, RCB Stars Devastating Revelation

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేష్ శ‌ర్మ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మోహన్ శర్మ ఫిబ్రవరి 1వ తేదీన అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ విషయాన్ని జితేష్ శ‌ర్మ ధ్రువీక‌రించాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో జితీశ్ త‌న తండ్రిని త‌లుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ప్రపంచకప్ జట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం కంటే, తన తండ్రిని కోల్పోవడం తనను ఎంతగానే కలచివేసిందని జితేశ్ తెలిపాడు. కాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 ముందు వ‌ర‌కు జితీశ్ భార‌త జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా ఉన్నాడు. అయితే ఇషాన్ కిష‌న్ రీ ఎంట్రీతో భార‌త టీ20 జ‌ట్టులో జితీశ్ స్ధానం గ‌ల్లంతైంది. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోనూ జితీశ్ శ‌ర్మ‌కు చోటు ద‌క్క‌లేదు. సంజూ శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్‌ల‌ను వికెట్ కీప‌ర్‌లగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. దీంతో జితీశ్ జ‌ట్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. సెలెక్ట‌ర్లు తీసుకున్న ఈ నిర్ణ‌యం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కానీ జ‌ట్టులోకి వ‌చ్చిన కిష‌న్ మాత్రం త‌న ఎంపికకు న్యాయం చేశాడు.

నేను మ‌నిషినే.. 
"వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదని తెలిసినప్పుడు కొంత బాధ కలిగింది. ఎందుకంటే నేను కూడా మ‌నిషినే. కానీ కొంత సమయం గడిచాక ఆ బాధ తగ్గిపోయింది. ఆ తర్వాత మా నాన్న అనారోగ్యం పాలయ్యారు. ఫ్రిబ‌వ‌రి 1న ఆయ‌న మ‌ర‌ణించారు. నేను మా నాన్న‌తో పాటు ఏడు రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే ఉన్నాను. 

ఆ సమయంలో నాకు ఒక విష‌యం అర్థమైంది..  ప్రపంచకప్ కంటే మా నాన్నకు నేనే ఎక్కువ అవసరం అన్పించింది.  ఆ త‌ర్వాత వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో చోటు ద‌క్క‌పోయినందుకు ఎలాంటి బాధ  అనిపించలేదు. ఎవ‌రిపైనా కోపం క‌ల‌గ‌లేదు. దేవుడు ఆ ఏడు రోజులు నాన్న‌తో గ‌డిపే అవ‌కాశం నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని. 

ఆ స‌మ‌యంలో అత‌డిని నేను ద‌గ్గరుండి చూసుకోగ‌లిగాను. ఇంట్లో టీవీలో ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు చూసి ఆనందించాను. బయట కూర్చొని మ్యాచ్ చూడడం కూడా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఏదైమైన‌ప్ప‌టికి భార‌త జ‌ట్టు విజ‌యం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.

నా కెరీర్‌ను కొనసాగిస్తా
మా నాన్న లేని లోటు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. దాన్ని ఎవరూ పూడ్చలేరు. ఇలాంటి స‌మ‌యంలో మా నాన్న ఉంటే'బాధను పక్కన పెట్టి వెళ్లి ప్రాక్టీస్ చెయ్' చెప్పేవారు. కాబట్టి ఆబాధను దిగమింగుతూ నా క్రీడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా జితీశ్ మళ్లీ ఐపీఎల్‌-2026లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు. మరో భారత క్రికెటర్‌ రింకూ సింగ్‌ తండ్రి కూడా వరల్డ్‌కప్‌ సమయంలోనే ప్రాణాలు విడిచారు.
చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement