సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పేరులోనే ‘సౌమ్య’.. గ్రౌండ్‌లోకి దిగితే చిచ్చరపిడుగే.. కృషి, పట్టుదలతో ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తోన్న గుగులోత్ సౌమ్య.. పందొమ్మిదేళ్లకే భారత సీనియర్ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. ఈ నెల 14 నుంచి టర్కీలో జరిగే అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆడనుంది. గోవాలో 20 మందితో కూడిన తుది జట్టును బుధవారం ప్రకటించగా, అందులో సౌమ్య చోటు సంపాదించింది. 30 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన క్రీడాకారిణిగానూ సౌమ్య ఘనత సాధించింది. సౌమ్య స్వస్థలం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కిసాన్‌నగర్ తండా. నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తండ్రి గుగులోత్ గోపి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ధనలక్ష్మి గృహిణి. ఇద్దరు అక్కలు, తమ్ముడు ఉన్నారు.
అండర్–14 నుంచి..
నేపాల్‌లో జరిగిన అండర్ 14 ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున తొలిసారిగా ఆడిన సౌమ్య.. ఆపై చైనాలో అండర్ 16, మయన్మార్‌లో అండర్ 19 పోటీల్లో ఆడి ప్రతిభ చాటింది. దక్షిణాఫ్రికాలో 2019లో జరిగిన అండర్ 17 పోటీల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించింది. భారత సీనియర్ మహిళల జట్టులో చోటు కోసం 11 నెలలు ప్రాక్టీస్ చేసింది. లాక్‌డౌన్‌లో క్రీడా ప్రాంగణాలన్నీ మూసివేసినా.. ప్రత్యేక అనుమతితో నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసింది. సోదరి వివాహానికీ హాజరుకాకుండా ప్రాక్టీస్‌ను కొనసాగించిందని కోచ్ నాగరాజు ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.
వేగమే ఆమె బలం..
ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో సౌమ్య కదలికలు చాలా వేగంగా ఉంటాయి. సీనియర్ జట్టులో చోటు కోసం కఠోరంగా శ్రమించింది. రోజూ ఆరు గంటల పాటు ప్రాక్టీస్ చేసేది. ఎలాగైనా గోల్ కొట్టాలనే కసి, అగ్రెసివ్‌నెస్ ఆమెకు కలిసొస్తున్నాయి.
– గొట్టిపాటి నాగరాజు, కోచ్
నమ్మలేకపోయా..
భారత సీనియర్ జట్టుకు ఎంపికైనట్టు సౌమ్య ఉదయం ఫోన్‌చేసి చెప్పింది. మొదట నమ్మలేదు. జట్టులో చోటుకోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది సీనియర్లు పోటీపడతారు. అలాంటి జట్టుకు నా కుమార్తె ఎంపిక కావడం గర్వకారణం.
– గుగులోత్ గోపి, సౌమ్య తండ్రి
చిన్న వయసులోనే..
ఆటలో మాకంటే ప్రతిభ చూపడం వల్లే సౌమ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. సౌమ్య భారత సీనియర్ మహిళల జట్టులో చిన్న వయసులోనే చోటు సంపాదించింది.
– మేఘన, ఫుట్‌బాల్ క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment