Sourav Ganguly: The Golden Era in Indian Cricket - Sakshi
Sakshi News home page

Sourav Ganguly: ప్రపంచ క్రికెట్‌పై 'దాదా' గిరి.. గంగూలీ హయాం భారత క్రికెట్‌కు స్వర్ణయుగం

Published Thu, Aug 10 2023 7:49 PM | Last Updated on Fri, Aug 11 2023 2:33 PM

Sourav Ganguly Era In Indian Cricket Said To Be Golden Period - Sakshi

సౌరవ్‌ చండీదాస్‌ గంగూలీ.. ఈ పేరు తెలియని భారత క్రికెట్‌ అభిమాని ఉండడు. ఇతన్ని అందరూ ముద్దుగా దాదా (బెంగాలీలో అన్న అని అర్ధం) అని పిలుచుకుంటారు. 90వ దశకంలో (1992) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగపెట్టి, దాదాపు 16 ఏళ్ల పాటు (2008) దిగ్విజయంగా కెరీర్‌ను కొనసాగించిన ఈ కోల్‌కతా ప్రిన్స్‌.. అత్యుత్తమ బ్యాటర్‌గా, ఆల్‌రౌండర్‌గా, అత్యుత్తమ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకున్నాడు.

1992లో విండీస్‌తో వన్డేతో ఇంటర్నేషనల్‌ కెరీర్‌ ప్రారంభించిన దాదా.. ఆ మ్యాచ్‌లో విఫలం కావడంతో దాదాపు నాలుగేళ్ల పాటు భారత జట్టుకు ఆడలేకపోయాడు. అనంతరం 1996 ఇంగ్లండ్‌ పర్యటనలో రెండో టెస్ట్‌తో టెస్ట్‌ అరంగేట్రం చేసిన గంగూలీ.. తానాడిన తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, సెన్సేషన్‌గా మారాడు. 

అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని గంగూలీ భారత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగాడు. టీమిండియాలో ఓ పక్క సచిన్‌ హవా నడుస్తున్నా, బ్యాటర్‌గా గంగూలీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. దూకుడే మంత్రంగా గంగూలీ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అప్పటివరకు గంగూలీలా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన భారత బ్యాటర్లు లేరు.

1997లో శ్రీలంకపై తొలి వన్డే శతకాన్ని బాదిన దాదా.. ఆ తర్వాతి కాలంలో వన్డే క్రికెట్‌లో దాదాగిరి కొనసాగించాడు. 1998లో పాక్‌తో జరిగిన సహారా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న గంగూలీ, ఆ సిరీస్‌తో తనలోని బౌలర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 1999 వరల్డ్‌కప్‌లో గంగూలీ బ్యాటింగ్‌ శిఖరాగ్ర స్థాయికి చేరింది. ఆ మెగా టోర్నీలో అతను ఎన్నో రికార్డులను సాధించాడు. 

ప్రపంచ క్రికెట్‌పై మొదలైన దాదాగిరి..
అనూహ్య పరిణామాల మధ్య 2000 సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. కెప్టెన్‌గా తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆట పరంగా, వ్యక్తిగతంగా దూకుడు స్వభావి అయిన గంగూలీ అదే మంత్రాను కెప్టెన్‌గానూ కొనసాగించాడు. అదే దూకుడును భారత జట్టుకు కూడా నేర్పించాడు. అప్పట్లో ఆటతో పాటు మాటకు కూడా పని చెప్పే ఆస్ట్రేలియన్లతో సై అంటే సై అన్నాడు. అప్పటిదాకా నిదానంగా ఉండిన టీమిండియా ఆటగాళ్లలో ధైర్యాన్ని నూరిపోశాడు.

గంగూలీ నేతృత్వంలో భారత జట్టు డిఫెన్సివ్‌ మోడ్‌ నుంచి అటాకింగ్‌ మోడ్‌కు గేర్‌ మార్చింది. దీని ఫలితంగా టీమిండియా ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఆ సమయంలో భారత జట్టు తిరుగులేని జట్టుగా చలామణి అయ్యింది. ప్రపంచ క్రికెట్‌లోని అగ్రశ్రేణి జట్లన్నీ టీమిండియా  దెబ్బకు గడగడలాడాయి. భారత క్రికెట్‌కు అది స్వర్ణయుగంగా చెప్పవచ్చు.

మహేంద్రసింగ్ ధోని,  యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు దాదా హయాంలో  వెలుగులోకి వచ్చారు. ఓరకంగా చెప్పాలంటే వారు దాదా అండర్‌లోనే రాటుదేలారు. ఆతర్వాత ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా పేరొందారు.

ఈ క్రమంలోనే దాదా సారధ్యంలో భారత్‌ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అప్పటివరకు విదేశాల్లో అడపాదడపా విజయాలు సాధించిన టీమిండియా గంగూలీ నేతృత్వంలో ఆసీస్‌ లాంటి జట్టును వారి స్వదేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. అదే దాదాగిరితో 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2003 వన్డే వరల్డ్ కప్ లో  ఫైనల్ కు చేరింది.

2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచాక  గంగూలీ షర్ట్ విప్పి చేసుకున్న సంబురాలు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అత్యన్నత శిఖరాలు అధిరోహించిన గంగూలీ.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అత్యుత్తమ కెప్టెన్లలో ప్రథముడిగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రపంచ క్రికెట్‌పై దాదాగిరి చేసిన గంగూలీ భారత క్రికెట్‌ రూపురేఖలను మార్చాడని వేనోళ్ల కీర్తించబడ్డాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు అత్యుతన్న శిఖరాలను అధిరోహించిందని, కెప్టెన్‌గా గంగూలీ జమానా భారత క్రికెట్‌కు స్వర్ణయుగం లాంటిదని విశ్లేషకులు సైతం అభివర్ణిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement