బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కమల తీర్ధం పుచ్చుకోనున్నాడన్న వార్తలు ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ (మే 6) దాదాతో సమావేశం కానుండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో పార్టీలోకి ఆహ్వానించేందుకే అమిత్ షా స్వయంగా గంగూలీ ఇంటికి వెళ్లనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం కోల్‌కతా పర్యటనలో ఉన్న అమిత్ షా ఇవాళ (శుక్రవారం) సాయంత్రం గంగూలీ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారని, ఆతర్వాత వీరిద్దరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారని తెలుస్తోంది.
బయటికి ఇది సాధారణ భేటీ మాత్రమేనని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నప్పటికీ.. షా పక్కా వ్యూహంతోనే గంగూలీని కలుస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, 2021 అసెంబ్లీ ఎన్నకల సమయంలోనే గంగూలీని బీజేపీలోకి లాక్కోవాలని కమల దళం గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే, ఆ సమయంలో కాషాయ కండువా కప్పుకునేందుకు దాదా ససేమిరా అన్నారు. బెంగాల్ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గంగూలీ.. ఆ సమయంలో బీజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరించడంతో కమల దళానికి ఊహించినన్ని సీట్లు రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా దాదాను పార్టీలోకి తీసుకుని అతన్నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫోకస్ చేయాలని బీజేపీ ఇప్పటినుంచే ప్రయత్నాలను మొదలు పెట్టింది.
మరోవైపు గంగూలీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సైతం సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. దీంతో దాదా ఏ పార్టీలో జాయిన్ అవుతాడోనని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. బెంగాలీలచే ముద్దుగా ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతాగా పిలువబడే గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చదవండి: ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్!
Comments
Please login to add a commentAdd a comment