బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. సిరీస్‌ కైవసం | South Africa Beat Bangladesh By Innings 273 Runs In 2nd Test | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. సిరీస్‌ కైవసం

Published Thu, Oct 31 2024 4:52 PM | Last Updated on Thu, Oct 31 2024 4:52 PM

South Africa Beat Bangladesh By Innings 273 Runs In 2nd Test

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇవాళ (అక్టోబర్‌ 31) ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 273 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టెస్ట్‌ల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికాకు ఇది భారీ విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (106), వియాన్‌ ముల్దర్‌ (105 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. ఈ ముగ్గురికి కెరీర్‌లో (టెస్ట్‌) ఇవి తొలి సెంచరీలు. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు తొలి సెంచరీలు నమోదు చేయడం ప్రపంచ రికార్డు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ, ట్రిస్టన్‌, ముల్దర్‌ సెంచరీలతో సత్తా చాటగా.. డేవిడ్‌ బెడింగ్హమ్‌ (59), సెనురన్‌ ముత్తుస్వామి (68 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు.

అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. రబాడ దెబ్బకు (5/37) తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. డేన్‌ పీటర్సన్‌, కేశవ్‌ మహారాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి ఓ వికెట్‌ దక్కింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హాక్‌ (82), తైజుల్‌ ఇస్లాం (30), మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 416 పరుగులు వెనుకపడి ఫాలో ఆన్‌ ఆడిన బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌ ఐదు, ముత్తుస్వామి నాలుగు వికెట్లు, పాటర్సన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో షాంటో (36), హసన్‌ మహమూద్‌ (38 నాటౌట్‌), ఇస్లాం అంకోన్‌ (29), మహ్మదుల్‌ హసన్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement