న్యూయార్క్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చెమటోడ్చి రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన పోరులో సఫారీ 4 వికెట్లతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ నెగ్గిన సఫారీ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకేల్ లెవిట్ (0), మ్యాక్స్ ఓ డౌడ్ (2) సహా టాపార్డర్‌లో విక్రమ్‌జీత్ (12) కూడా నిరాశపరిచారు.
ఈ దశలో సైబ్రాండ్ (45 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ లొగాన్ వాన్ బిక్ (23; 3 ఫోర్లు) అండతో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఐదో ఓవర్ ముగియకముందే 12 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్ ఫలితం పునరావృతమవుతుందేమో అనిపించింది.
అయితే ట్రిస్టన్ స్టబ్స్ (37 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)కు జతయిన మిల్లర్ (51 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితి చక్కబెట్టాడు. అనంతరం అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment