మహిళల క్రికెట్‌లో తమపై ఆస్ట్రేలియా ఆథిపత్యానికి సౌతాఫ్రికా చెక్ పెట్టింది. వన్డేల్లో వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం ఎరుగని ప్రొటీస్ జట్టు.. ఎట్టకేలకు 17వ ప్రయత్నంలో (ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 16 వన్డేల్లో ఓ మ్యాచ్ టై కాగా మిగతా మ్యాచ్‌లన్నీ ఆస్ట్రేలియానే గెలిచింది) విజయం సాధించగలిగింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 80 పరుగుల తేడాతో గెలుపొందింది. 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మారిజెన్ కప్ (75) అర్ధసెంచరీతో రాణించగా.. అన్నెక్ బోష్ (44), క్లో టైరాన్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, ఆష్లే గార్డ్‌నర్ తలో రెండు వికెట్లు సాధించగా.. సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 29.3 ఓవరల్లో 149 పరుగులకే చాపచుట్టేసింది. మారిజెన్ కెప్ 3, అయాండా హ్లుబీ, ఎలిజ్ మారి మార్క్స్, డి క్లెర్క్ తలో 2 వికెట్లు, క్లో టైరాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ప్లేయర్ కిమ్ గార్త్ (42 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గార్త్.. గార్డ్‌నర్ (35) సాయంతో ఈ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆసీస్ మరింత దారుణంగా ఓడేది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆసీస్ గెలువగా.. రెండో దాంట్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 10న సిడ్నీలోనే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment