తొలి టి20లో దక్షిణాఫ్రికాదే గెలుపు
12 పరుగులతో ఓడిన భారత్
చెన్నై: వన్డే సిరీస్, ఏకైక టెస్టులో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు టి20 సిరీస్‌లో భారత మహిళలకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో శుభారంభం చేసిన సఫారీ టీమ్ టీమిండియాపై పైచేయి సాధించింది. శుక్రవారం చెపాక్ మైదానంలో చివరి వరకు హోరాహోరీగా సాగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తజ్‌మిన్ బ్రిట్స్ (56 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), మరిజన్ కాప్ (33 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగగా...కెపె్టన్ లారా వోల్‌వార్ట్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించింది. బ్రిట్స్, కాప్ రెండో వికెట్‌కు 56 బంతుల్లోనే 96 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్, రాధ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. జెమీమా రోడ్రిగ్స్ (30 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... స్మృతి మంధాన (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించారు. స్మృతి, షఫాలీ వర్మ (18) తొలి వికెట్‌కు 32 బంతుల్లోనే 56 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద స్మృతి, హేమలత (18) వెనుదిరిగారు.
విజయం కోసం 59 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన ఈ దశలో జెమీమా, హర్మన్ జత కలిశారు. వీరిద్దరు దూకుడుగా ఆడి నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 90 పరుగులు జోడించగలిగినా...చివరకు ఓటమి తప్పలేదు. తాజా ఫలితంతో సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో టి20 మ్యాచ్ ఆదివారం ఇక్కడే జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment