లక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్(104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలోనూ టీమిండియా మహిళలు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.3 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. మిథాలీ రాజ్ మినహా.. ప్రియా పూనియా (18), స్మృతి మంధాన (18), పూనమ్ రౌత్ (10), హేమలత (2), సుష్మ వర్మ (0) దారుణంగా విఫలమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (30) కుదురుగా ఆడుతున్న సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగటం టీమిండియాకు భారీ నష్టమే చేకూర్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నదీన్ డి క్లెర్క్ 3, షంగేస్, సేఖుకునే 2, కాప్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా మహిళలు 48.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్నందుకున్నారు. సఫారీ బ్యాటర్లలో డుప్రీజ్ (57), అన్నె బోష్(58), కాప్(36 నాటౌట్) రాణించారు. టీమిండియా బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3, హేమలత, ప్రత్యూష తలో వికెట్ దక్కించుకున్నారు. అన్నె బోష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కగా, లిజెల్ లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ దక్కించుకుంది. దీంతో 5 వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మహిళలు 4-1తేడాతో గెలుపొందారు. ఇరు జట్ల మధ్య 3 టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇదే వేదికగా మార్చి 20న ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment