క్రీడారంగంలో ఊహించని ఓ విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన స్పెయిన్ సైక్లిస్ట్ రాల్ గార్సియా అల్వరేజ్ శుక్రవారం కన్నుమూశాడు. అల్వరేజ్ టీనేజ్ వయసులోనే ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా మారాడు. తన 17 ఏళ్ల వయసులో వెంటా మగుల్లో-బి మెలెరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ ఒప్పందమే అతని సైక్లింగ్ కెరీర్‌కు చివరిది కానుందని ఊహించలేదు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ వద్ద ఎత్తైన కొండమీద సైక్లింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. గంటకు 50మీటర్ల వేగంతో తన టీమ్‌తో కలిసి సైక్లింగ్ చేశాడు. ఈ దశలో సైకిల్ పట్టుతప్పడంతో ఐదు మీటర్ల లోతులోకి పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో పాటు చాతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
అల్వరేజ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి మాడ్రిడ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. దాదాపు నాలుగున్నర గంటలు సర్జరీ నిర్వహించి అతన్ని కాపాడినప్పటికి శాశ్వత కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు ఆసుపత్రి బెడ్‌పైనే ఉండిపోయిన గార్సియాలో కదలిక లేకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే అల్వరేజ్‌పై ఉన్న ప్రేమతో అతన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అల్వరేజ్ తల్లి అతనికి సేవలందించింది. అలా 24 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయిన అల్వరేజ్ తాజాగా 42 ఏళ్ల వయసులో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment