గాయాలతో హార్దిక్‌ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు! | Special Care For Hardik Pandya BCCI 18-Week High-Performance Programme: Report | Sakshi
Sakshi News home page

WC T20: గాయాలతో హార్దిక్‌ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు..

Published Tue, Dec 5 2023 3:22 PM | Last Updated on Tue, Dec 5 2023 4:14 PM

Special Care for Hardik Pandya BCCI 18 Week High Performance Programme: Report - Sakshi

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డ హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)

Hardik Pandya- T20 World Cup 2024: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడన్న అంచనాలు తలకిందులు చేశాడు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పట్టుతప్పి జారిపడి చీలమండకు గాయం చేసుకున్నాడు.

అప్పుడు వెన్నునొప్పి.. ఇప్పుడు
మడిమ నొప్పి తీవ్రం కావడంతో సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్‌ మొత్తానికి దూరమయ్యాడు. గతంలోనూ టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత హార్దిక్‌ పాండ్యా ఇదే తరహాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో.. వెన్నునొప్పి వల్ల చాలా కాలం పాటు జట్టుకు దూరమైన అతడి కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి
అయితే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించి.. ఐపీఎల్‌-2022లో అనూహ్య రీతిలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు హార్దిక్‌. అరంగేట్ర సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపి ఘనంగా తన పునరాగమనం చాటుకున్నాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు.

రోహిత్‌ శర్మ గైర్హాజరీలో పలు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లకు సారథ్యం వహించి ట్రోఫీలు అందించాడు. అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2023 సమయంలో గాయపడ్డ హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌పై వైద్యులు స్పష్టతనివ్వకపోవడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

అప్పటి దాకా పగ్గాలు అతడికే
వచ్చే ఏడాది జూన్‌ 4 నుంచి టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభం కానున్న తరుణంలో హార్దిక్‌ పాండ్యా ఇలా జట్టుకు దూరం కావడం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హార్దిక్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకముందే.. హడావుడిగా ద్వైపాక్షిక సిరీస్‌లకు ఎంపిక చేయొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, పాండ్యా గైర్హాజరీలో సూర్యకు​మార్‌ యాదవ్‌నే కెప్టెన్‌గా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

హార్దిక్‌ కోసం బీసీసీఐ బిగ్‌ప్లాన్‌
ప్రపంచకప్‌ ఈవెంట్‌కు ముందు.. టీమిండియా ఇంకో రెండు టీ20 సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. ఇప్పటికే సౌతాఫ్రికాతో సిరీస్‌కు సూర్య సారథ్యం వహించనున్నాడు. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు కూడా హార్దిక్‌ను తిరిగి రప్పించకుండా.. 18 వారాల పాటు అతడి కోసం హై పర్ఫామెన్స్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిపుణుల పర్యవేక్షణలో హార్దిక్‌ ఉండనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు క్రిక్‌నెక్ట్స్ తో మాట్లాడుతూ.. ‘‘పనిభారాన్ని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజమే.

టీ20 క్రికెటర్‌గా అతడి సామర్థ్యాలపై మాకెలాంటి సందేహం లేదు. అయితే, దీర్ఘకాలంలో అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలనుకుంటే.. ప్రత్యేక శ్రద్ధ అవసరం. గతంలో పాండ్యా వెన్నునొప్పికి ఇప్పటి గాయానికి సంబంధం లేదు. 

గతంలో వాళ్ల కోసం కూడా
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు గాయపడ్డాడు. కాబట్టి అతడి కోసం కచ్చితంగా మేము శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వరల్డ్‌కప్‌ రూపంలో మెగా టోర్నీ ఆడాల్సి ఉంది. గతంలో వెన్నునొప్పి నుంచి కోలుకుని అద్బుతాలు చేసినట్లే ఇప్పుడు కూడా హార్దిక్‌ త్వరగా తిరిగి రావాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది.

అయినా.. శ్రేయస్‌ అయ్యర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, కేఎల్‌ రాహుల్‌ గాయపడిన సమయంలోనూ మేము ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం’’ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌-2024 నాటికి తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక ఇటీవలే అతడు గుజరాత్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్‌ అయిన విషయం తెలిసిందే.

చదవండి: పది మంది స్కోర్లను ఒక్కడే కొట్టేశాడు.. విధ్వంసం సృష్టించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement