స్పిన్నర్లకే మొత్తం 20 వికెట్లు
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో 127 పరుగుల తేడాతో విజయం
ముల్తాన్: సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పూర్తిగా స్పిన్‌కు సహకరించేలా రూపొందించిన పిచ్‌పై... సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్, నోమాన్ అలీ కలిసి ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడం విశేషం.
ఓవర్‌నైట్ స్కోరు 109/3తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ జట్టు 46.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ షాన్ మసూద్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధశతకం సాధించగా... మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (5), సౌద్ షకీల్ (2), మొహమ్మద్ రిజ్వాన్ (2), ఆఘా సల్మాన్ (14) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాటపట్టారు. కరీబియన్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వారికన్ 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 93 పరుగులతో కలుపుకొని వెస్టిండీస్ ముందు 251 పరుగుల లక్ష్యం నిలిచింది.
బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనాజె (68 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఒక్కడే హాఫ్‌సెంచరీ చేయగా... మిగిలిన వాళ్లు నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ సాజిద్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా... అబ్రార్ అహ్మద్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన సాజిద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి ముల్తాన్‌లోనే రెండో టెస్టు ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment