
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో శ్రీలంక మరో ఓవర్ మాత్రమే మిగిలి ఉండగా విజయతీరాలకు చేరింది. జనిత్ లియనగే (95) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ ఐదు వికెట్ల ఘనతతో (5/32) శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు. అయినా అంతిమంగా శ్రీలంకనే విజయం వరించింది. కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నగరవ రికార్డు స్థాయిలో వరుసగా 28వ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో వికెట్ తీసి ఔరా అనిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తీక్షణ (4/31), చమీరా (2/44), వాండర్సే (2/47), మధుషంక (1/24) ధాటికి 44.4 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (82) మాత్రమే రాణించాడు. జాయ్‌లార్డ్ గుంబీ (30), మిల్టన్ షుంబ (26), ర్యాన్ బర్ల్ (31), క్లైవ్ మదాండే (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు నగరవ ముచ్చెమటలు పట్టించాడు. నగరవ ధాటికి శ్రీలంక ఓ దశలో ఓడిపోయేలా కనిపించింది. అయితే లియనగే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తన జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఆఖర్లో సహన్ అరచ్చిగే (21), తీక్షణ (18), చమీరా (18 నాటౌట్), వాండర్సే (19 నాటౌట్) తలో చేయి వేయడంతో శ్రీలంక విజయతీరాలకు చేరింది. జింబాబ్వే బౌలర్లలో నగరవతో పాటు సికందర్ రజా (2/32), ముజరబానీ (1/41) వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 11న జరుగుతుంది. వర్షం కారణంగా తొలి వన్డే తుడిచిపెట్టుకపోయిన విషయం తెలిసిందే.