Muttiah Muralitharan- 800 Wickets: అతడిది అసలు బౌలింగే కాదన్నారు. త్రో చేస్తున్నాడని, బౌలర్ కాదు జావెలిన్ త్రోయర్ అన్నారు. మోసంతో సాధించిన వికెట్లు, రికార్డులు అసలు లెక్కకే రావని, వాటిని పక్కన పడేయాలని విమర్శించారు. అతని కోసమే నిబంధనలు మార్చారని, అలా అయితే అది క్రికెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
అడుగడుగునా అవమానాలు, మైదానంలోకి దిగితే చాలు స్టాండ్స్ నుంచి ప్రేక్షకుల బూతు పురాణాలు. కొందరు అతడిని తమిళ తీవ్రవాదిగానూ చిత్రించారు. క్రికెట్ చరిత్రలో ఇంతటి అవమానాలను ఎదుర్కొని, దోషిలా విచారణకు గురైన క్రికెటర్ మరెవరూ లేరు. కానీ ఇన్ని ఆటుపోట్ల మధ్య అతని సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు.
పట్టుదలతో ప్రతికూల పరిస్థితులకు అతను ఎదురీదాడు. చివరకు అన్ని అడ్డంకులనూ అధిగమించి ఉన్నతస్థానానికి చేరాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కీర్తిని అందుకున్నాడు. అతడే ముత్తయ్య మురళీధరన్. అద్భుతమైన ఆట, ఘనతలతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీలంక ఆఫ్‌స్పిన్నర్.
నాపై నాకు నమ్మకం ఉంది
2010 జులై 18 నుంచి గాలేలో భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్.. ఈ మ్యాచ్‌తోనే తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని మురళీధరన్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. సహచరులు అందరూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నో సాధించి అప్పటికే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందిన అతనికి ఒక మైలురాయి పెద్ద ఘనత కాకపోవచ్చు. కానీ 800 అనే సంఖ్య చెప్పుకునేందుకు మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది.
అందుకే అతను 800 వికెట్ల మార్క్ అందుకోవాలని వారు ఆశించారు. ఒక్క టెస్టులోనే 8 వికెట్లు కష్టమని, సిరీస్‌లో మరో రెండు టెస్టులు ఉన్నాయి కాబట్టి అది సాధించిన తర్వాతే రిటైర్ కావాలని, కనీసం 800 వచ్చాకే రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా వారు సూచించారు. కానీ మురళీ వినలేదు. ‘నాపై నాకు నమ్మకం ఉంది’ అంటూ స్పష్టంగా చెప్పేశాడు.
వికెట్‌కు అవకాశం లేని బంతులు వేస్తూ
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అతనికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కావాలి. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోగా, అతని ఖాతాలో మరో 2 వికెట్లు చేరాయి. చివరి వికెట్ మిగిలింది. అది తాము మాత్రం తీయరాదని బౌలర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వికెట్‌కు అవకాశం లేని బంతులు వేస్తూ ఉడతాభక్తిగా సాయం చేస్తూ వచ్చారు.
మురళీధరన్‌కు 800వ వికెట్ అతడే
చివరకు అందరూ ఎదురు చూసిన క్షణం వచ్చింది. ప్రజ్ఞాన్ ఓఝా స్లిప్‌లో జయవర్ధనేకు క్యాచ్ ఇవ్వడంతో గాలే స్టేడియం దద్దరిల్లింది. స్టేడియం పక్కనే ఉండే సముద్ర ఘోష కూడా వినిపించని రీతిలో అభిమానులు హోరెత్తించారు. అది మురళీధరన్‌కు 800వ వికెట్. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, ఈ స్థితికి చేరేందుకు పడిన శ్రమ ఆ దిగ్గజ స్పిన్నర్‌ను భావోద్వేగానికి గురి చేశాయి.
అలెన్ బోర్డర్‌ను ఆశ్చర్యపరచి..
పాఠశాల స్థాయిలో అందరిలాగే తానూ ఒక ఆటను ఎంచుకోవాలని మురళీ క్రికెట్ వైపు మొగ్గాడు. మీడియం పేస్ బౌలర్‌గా అతను మొదలు పెట్టినా స్కూల్ టీమ్‌లో స్పిన్నర్ అవసరాన్ని గుర్తించి కోచ్ అతడిని స్పిన్ వైపు మళ్లించాడు. దాంతో 14 ఏళ్ల వయసులో కొత్త విద్యపై అతను దృష్టి పెట్టాల్సి వచ్చింది.
అయితే మురళీ పట్టుదలగా సాధన చేసి అందరి దృష్టిలో పడ్డాడు. వరుసగా వికెట్లు పడగొడుతూ ఉత్తమ ఆటగాడిగా నిలుస్తూ వచ్చాడు. తన కుటుంబ సభ్యుల నుంచి లభించిన గట్టి మద్దతు మురళీకి మేలు చేసింది. మరో ఆలోచన లేకుండా క్రికెట్‌పై దృష్టి పెట్టేలా చేసింది.
బేకరీ వ్యాపారం చేస్తూ..
బేకరీ వ్యాపారం చేసే ముత్తయ్య నలుగురు కుమారుల్లో మురళీ ఒకడు. స్కూల్ స్థాయి దాటాక స్థానిక క్లబ్‌లలో కూడా సత్తా చాటి ఎదుగుతూ పోయిన అతనికి సహజంగానే శ్రీలంక ‘ఏ’ టీమ్‌లో అవకాశం లభించింది. అయితే ఆ తర్వాత అసలు సమయం వచ్చింది. 20 ఏళ్ల వయసులో మురళీ గురించి ప్రపంచానికి తెలిసింది.
శ్రీలంక పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. అందులో మురళీని ఎంపిక చేశారు. నాటి దిగ్గజం, ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్ కూడా అతని బంతులను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. దాంతో లంక బోర్డు మరో ఆలోచన లేకుండా అనూహ్యంగా రెండో టెస్టులో అవకాశం కల్పించి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టేలా చేసింది. అలా మొదలైన ఆ ప్రస్థానం సుదీర్ఘ కాలం పాటు సాగి రికార్డులను తిరగరాసింది.
గింగిరాలు తిరిగే బంతితో..
మురళీధరన్ బౌలింగ్ శైలే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా ఆఫ్ స్పిన్నర్లు వేలితోనే బంతిని స్పిన్ చేస్తారు. అందుకే వారిని ఫింగర్ స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. అయితే మణికట్టును ఎక్కువగా వాడుతూ స్పిన్ బౌలింగ్ చేసే అరుదైన ప్రజ్ఞ అతని సొంతం. ఎలాంటి పిచ్ మీదైనా బంతిని అసాధారణంగా టర్న్ చేయగల నైపుణ్యం అతనికి పెద్ద సంఖ్యలో వికెట్లను అందించింది.
మారథాన్ స్పెల్స్ వేయగలడు
సుదీర్ఘ సమయం పాటు విరామం లేకుండా మారథాన్ స్పెల్స్ వేయగల సామర్థ్యం అతని సొంతం. అందుకే అరడజను మంది లంక కెప్టెన్లకు ఎప్పుడైనా అతనే ప్రధాన ఆయుధం. అతడిని సమర్థంగా వాడుకున్న వారంతా నాయకులుగా గొప్ప విజయాలను తమ ఖాతాలో వేసుకోగలిగారు. తర్వాతి రోజుల్లో దూస్రా అనే పదునైన ఆయుధం మురళీ అమ్ముల పొదిలోకి చేరింది.
20 వికెట్లు మురళి ఖాతాలో ఉండాల్సిందే
సమకాలీనుల్లో స్పిన్‌ను బాగా ఆడగలరని పేరున్న బ్యాటర్లందరూ మురళీని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డవారే. అతని స్పిన్ దెబ్బకు ఎన్నో కెరీర్‌లు ముగిశాయంటే అతిశయోక్తి కాదు. ఒక మూడు టెస్టుల సిరీస్ జరిగిందంటే కనీసం 20 వికెట్లు మురళి ఖాతాలో ఉండాల్సిందే. శ్రీలంక వరుసగా చిరస్మరణీయ విజయాలు సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
పెద్దన్నలా అండగా..
ముఖ్యంగా అర్జున రణతుంగ కెప్టెన్సీలో మురళీ స్థాయి పెరిగింది. ‘ఒక పెద్దన్నలా అతను నాకు అండగా నిలబడ్డాడ’ని రణతుంగ గురించి మురళీ చాలా సార్లు చెప్పుకున్నాడు. 1996 వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకున్న శ్రీలంక జట్టులో మురళీధరన్ కూడా ఉన్నాడు.
రికార్డులే రికార్డులు..
అంతర్జాతీయ క్రికెట్‌లో మురళీధరన్ సాధించిన ఘనతల జాబితా చాలా పెద్దది. టెస్టులు, వన్డేలు, టి20లు కలిపి 1347 వికెట్లు తీసిన ఘనత అతని సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ఇది.
ఆ ఘనతకు గీటురాళ్లు ఎన్నో
11 సార్లు టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడం, వరుసగా 4 టెస్టుల్లో పదికి పైగా వికెట్లు పడగొట్టడం, అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 63,132 బంతులు వేయడం, టెస్టు కెరీర్‌లో ఒక టెస్టులో పదేసి వికెట్లు 22 సార్లు పడగొట్టడం, ఒక ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు 67 సార్లు తీయడం.. ఇలా ఒకటా, రెండా ఆ ఘనతకు గీటురాళ్లు ఎన్నో అతని సుదీర్ఘమైన కెరీర్‌లో!
సునామీ వచ్చినప్పుడు సొంత ఖర్చులతో
2002లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో అతను తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసి త్రుటిలో 10 వికెట్ల అవకాశం కోల్పోయాడు. ఆటతోనే కాకుండా సమాజ సేవతోనూ మురళీకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ముఖ్యంగా 2004లో శ్రీలంకలో సునామీ వచ్చినప్పుడు అతను సొంత ఖర్చులతో ప్రత్యేక శ్రద్ధ చూపించి చేపట్టిన సహాయ కార్యక్రమాలు శ్రీలంక దేశవాసుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి.
‘800’ అనే సినిమా
కేవలం డబ్బు ప్రకటనతో సరిపెట్టకుండా అతను పడిన శ్రమ, ఇచ్చిన సమయం అతని సహాయ కార్యక్రమం విలువేమిటో చూపించాయి. సునామీ సహాయక కార్యక్రమం కోసమే అప్పటికప్పుడు దేశంలోని నంబర్‌వన్ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమై.. వారితో ఒప్పందం చేసుకోవడం విశేషం. ఇటీవలే మురళీ కెరీర్‌పై వచ్చిన ‘800’ అనే సినిమా కూడా అతని ఘనతలను చూపిస్తుంది.
-మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment