రెండో టి20లోనూ శ్రీలంక ఓటమి
దంచేసిన జైస్వాల్, సూర్య, పాండ్యా
7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
రేపు ఆఖరి టి20
పల్లెకెలె: చినుకులు పడినా... ఆట చాలాసేపు ఆగినా... భారత బ్యాటర్ల మెరుపుల్ని , విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. దీంతో ఆదివారం జరిగిన రెండో టి20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 7 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. ఇంకా 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా... ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
టాపార్డర్‌లో కుశాల్ పెరీరా (34 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా, ఓపెనర్ నిసాంక (24 బంతుల్లో 32; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవి బిష్ణోయ్ (3/26) కీలక వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేశాడు. అర్‡్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ లక్ష్యఛేదనకు దిగగానే వానొచ్చి మ్యాచ్‌ను ఆటంక పరచడంతో లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు.
దీన్ని టీమిండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) గెలిచేందుకు అవసరమైన మెరుపులు మెరిపించారు. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.
పెరీరా ఫిఫ్టీ
తొలి మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్లు కుశాల్ మెండిస్ (10), నిసాంకలను భారత బౌలర్లు ఈసారి కట్టడి చేశారు. అయితే వన్‌డౌన్ బ్యాటర్ పెరీరా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. నిసాంక, కమిండు మెండీస్ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు)లతో కలిసి జట్టు స్కోరు పెంచాడు. 31 బంతుల్లో పెరీరా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఒకే ఓవర్లో మెండిస్, పెరీరాలను అవుట్ చేస్తే... రవి బిష్ణోయ్ కూడా తర్వాతి ఓవర్లో షనక (0), హసరంగ (0)లను డకౌట్ చేయడంతో లంక తడబడింది. తర్వాత రమేశ్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు.
సులువుగా దంచేశారు!
వాన తర్వాత భారత లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులుగా మారింది. అప్పటికే 3 బంతులు పడటంతో 45 బంతుల్లో 72 పరుగుల సమీకరణం భారత్‌కు ఏమంత కష్టం కాలేదు. సంజూ సామ్సన్ (0) డకౌటైనా... కెపె్టన్ సూర్యకుమార్, ఓపెనర్ యశస్వి దంచేసే పనిలో పడ్డారు. హసరంగ మూడో ఓవర్లో జైస్వాల్ 6, 4 కొడితే సూర్య మరో బౌండరీ బాదడంతో 16 పరుగులు వచ్చాయి.
తీక్షణ మరుసటి ఓవర్లో సూర్యకుమార్ ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టి మరో 15 పరుగులు రాబట్టాడు. ఇదే ఊపులో పతిరణ ఐదో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన సూర్య తర్వాతి బంతికే అవుటయ్యాడు. 5 ఓవర్లలో భారత్ 54/2 స్కోరు చేసింది. ఇక 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సివుండగా, 6వ ఓవర్లో సిక్స్‌కొట్టి యశస్వి అవుటైనా... హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దంచేయడంతో 18 పరుగులొచ్చాయి. మరుసటి ఓవర్లో పాండ్యా రెండు బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 32; కుశాల్ మెండిస్ (సి) బిష్ణోయ్ (బి) అర్‡్షదీప్ 10; పెరీరా (సి) రింకూ సింగ్ (బి) పాండ్యా 54; కమిండు మెండిస్ (సి) రింకూ సింగ్ (బి) పాండ్యా 26; అసలంక (సి) సంజూ సామ్సన్ (బి) అర్‡్షదీప్ 14; షనక (బి) బిష్ణోయ్ 0; హసరంగ (బి) బిష్ణోయ్ 0; రమేశ్ మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12; తీక్షణ (బి) అక్షర్ 2; పతిరణ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–26, 2–80, 3–130, 4–139, 5–140, 6–140, 7–151, 8–154, 9–161. బౌలింగ్: సిరాజ్ 3–0–27–0, అర్శ్‌దీప్ 3–0–24–2, అక్షర్ 4–0–30–2, రవి బిష్ణోయ్ 4–0–26–3, పరాగ్ 4–0–30–0, పాండ్యా 2–0–23–2.
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) షనక (బి) హసరంగ 30; సంజూ సామ్సన్ (బి) తీక్షణ 0; సూర్యకుమార్ (సి) షనక (బి) పతిరణ 26; పాండ్యా (నాటౌట్) 22; పంత్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (6.3 ఓవర్లలో 3 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–12, 2–51, 3–65. బౌలింగ్: షనక 1–0–12–0, తీక్షణ 2–0–16–1, హసరంగ 2–0–34–1, పతిరణ 1.3–0–18–1.
Comments
Please login to add a commentAdd a comment