
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ పరాజయం పాలైంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌గా స్మిత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్మిత్ తెలిపాడు.
"వన్డేల్లో నా ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో భాగంగా ఉండడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఎంతోమంది సహచరలతో కలిసి నా క్రికెట్ జర్నీని కొనసాగించాను. 2027 వన్డే ప్రపంచకప్‌కు యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను.
అందుకే వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాను. ముఖ్యంగా అత్యున్నతస్ధాయిలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఎల్లప్పుడూ నాకు గర్వకారణమే. ఎల్లో జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఆనుభూతిని వర్ణించలేం. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులు, అభిమానులకు ధన్యవాదాలు.
ఇకపై టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా 2015, 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యునిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment