
సోఫియా (బల్గేరియా): రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 3–2తో ఒయుత్సెసెగ్ యెసుగెన్ (మంగోలియా)పై నెగ్గింది. ఈ బౌట్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ప్రతీ రౌండ్లోనూ పంచ్‌లతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు.
చివరకు విజయం నిఖత్‌నే వరించింది. అయితే మరో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ బౌట్‌లో ఊహించని రీతిలో అనర్హతకు గురై వెనుదిరిగింది.
75 కేజీల విభాగంలో ఓ రూర్కే ఆయిఫే (ఐర్లాండ్)తో తలపడుతుండగా లవ్లీనా రిఫరీ మూడో హెచ్చరికకు గురైంది. దీంతో మూడో రౌండ్ పూర్తవకముందే డిస్‌క్వాలిఫైతో బౌట్ నుంచి నిరాశగా ని్రష్కమించింది. 57 కేజీల కేటగిరీలో సాక్షి చౌదరి 5–0తో సెల్‌మౌని చాహిర (అల్జీరియా)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ (54 కేజీలు)కు ప్రిక్వార్టర్స్‌లో 2–3తో ఫే నియ (ఐర్లాండ్) చేతిలో చుక్కెదురైంది.
Comments
Please login to add a commentAdd a comment