IPL 2022: Glenn Maxwell Warns Opposition Teams Over Stress Free Virat Kohli - Sakshi
Sakshi News home page

IPL 2022: ప్రత్యర్ధులు బహు పరాక్‌.. కెప్టెన్సీ భారం లేని కోహ్లి ఉప్పెనలా విరుచుకుపడతాడు..

Published Thu, Mar 17 2022 9:01 PM | Last Updated on Fri, Mar 18 2022 8:40 AM

Stress Free Kohli Could Be Most Dangerous For Opposition Says Maxwell - Sakshi

Maxwell Comments On Virat Kohli: ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఓ విషయంలో ప్రత్యర్ధి జట్లను అలర్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఏ ఫార్మాట్‌లోనూ కెప్టెన్సీ భారం లేని తన జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ప్రత్యర్ధులపై విచక్షణారాహిత్యంగా విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరించాడు. కెప్టెన్సీ భారం ఉన్న సమయంలోనే ప్రత్యర్ధి బౌలర్లను చెడుగుడు ఆడుకున్న కోహ్లిని.. ఆ భారం దించుకున్న ప్రస్తుత తరుణంలో ఆపడం ఎవ్వరి తరం కాదని వార్నింగ్‌ ఇచ్చాడు. 

కెప్టెన్సీ ఒత్తిడి లేని కోహ్లి, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ మునుపటి కంటే ప్రమాదకారిగా మారి ప్రత్యర్ధులపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడతాడని జోస్యం చెప్పాడు. కోహ్లి కెప్టెన్‌ కాకముందు ఎలా దూకుడుగా ఉండేవాడో, ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌లో ఆ పాత కోహ్లినే మళ్లీ చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లిలో ఈ మార్పు ప్రత్యర్ధి జట్లకు ఎంత మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. కాగా, మ్యాక్స్‌వెల్‌ గత సీజన్ (2021) నుంచే కోహ్లితో పాటు ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్ల రిటెన్షన్‌లోనూ ఆర్సీబీ మ్యాక్సీని అట్టిపెట్టుకుంది. మ్యాక్స్‌వెల్‌ ఆర్సీబీలో చేరాక కోహ్లికి క్లోజ్ ఫ్రెండ్‌గా మారిపోయాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో 11 ఏళ్ల పాటు ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి గత సీజన్‌తో ఆ భారాన్ని దించుకున్నాడు. ఈ 11 ఏళ్ల కాలంలో ఆర్సీబీని ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలపలేకపోయిన కోహ్లి బ్యాటింగ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2016 సీజన్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదిన ఈ రన్‌ మెషీన్‌.. 973 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. అయితే తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో భంగపడటంతో ఆ జట్టు టైటిల్‌ కల కల్లగానే మిగిలిపోయింది. కోహ్లి ఐపీఎల్‌ కెప్టెన్సీతో పాటు టీమిండియా పగ్గాలు కూడా వదులుకున్న సంగతి తెలిసిందే. 
చదవండి: ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం.. హర్భజన్‌ సింగ్‌కు బంపర్‌ ఆఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement