Stuart Broad Is the Premature Baby Who Grew up to Become a Fearsome Fast Bowler - Sakshi
Sakshi News home page

#Stuart Broad: ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్‌ ప్రపంచంలో రారాజు

Published Sun, Jul 30 2023 11:49 AM

Stuart Broad is the premature baby who grew up to become a fearsome fast bowler - Sakshi

ప్రపంచక్రికెట్‌లో మరో శకం ముగిసింది. ఇంగ్లండ్‌ దిగ్గజం, స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ ఆఖరి టెస్టు అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకున్నట్లు అతడు వెల్లడించాడు.

2006లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్...తన 17 ఏళ్ల సుదీర్ఘ  కెరీర్‌లో ఎన్నో మైలురాయిలను  అందుకున్నాడు. అయితే ఒక సాధారణ స్ధాయి నుంచి ఇంగ్లండ్‌ లెజెండ్‌గా ఎదిగిన బ్రాడ్‌ నవ్వుల వెనుక గుండెలను పిండేసే వ్యథ దాగి ఉంది.

ప్రీ మెచ్యూర్ బేబీ..

ఇంగ్లండ్‌ క్రికెట్‌ రారాజుగా ఎదిగిన బ్రాడ్‌ తన పుట్టకతోనే చావు అంచుల దాకా వెళ్లాడు. బ్రాడ్‌ ఒక ప్రీ మెచ్యూర్ బేబీ. తన తల్లికి నెలల నిండకముందే బ్రాడ్‌ జన్మించాడు. 12 వారాల ముందుగానే భూమిపైకి వచ్చాడు. అంటే వాళ్ల అమ్మ 6వ నెలలోనే అతడికి జన్మను ఇచ్చింది. బ్రాడ్ నాటింగ్‌హామ్‌లోని సిటీ హాస్పిటల్‌లో 24 జూన్ 1986న పుట్టాడు. బ్రాడ్ పుట్టినప్పుడు కేవలం 907 గ్రాములు. ఆ సమయంలో అతడు బ్రతుకుతాడని ఎవరూ ఊహించలేదు. అతడు ఊపిరి కూడా తీసుకోవడానికి కష్టపడేవాడు. దాదాపు నెల రోజుల పాటు ఇంక్యుబేటర్‌లోనే ఉంచారు. అయితే ఆఖరికి బ్రాడ్ మ‌ృత్యువును జయించాడు. 

కానీ అతడి ఊపిరితిత్తుల సమస్య మాత్రం పూర్తిగా నయం కాలేదు. అతడు ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో బ్రాడ్ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికీ అతడు ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడు చాలా సందర్భాల్లో ఇన్‌హిల్లర్‌ వాడుతూ కన్పించేవాడు. బ్రాడ్‌కు చిన్నతనం నుంచే క్రీడలు అంటే చాలా ఇష్టం. అతడు శీతాకాలంలో ఫుట్‌బాల్, వేసవిలో క్రికెట్‌ ఆడేవాడు. కాగా అతడి తండ్రి క్రిస్‌ బ్రాడ్‌ కూడా ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.


 
ఫస్ట్‌ క్లాస్‌ ఎంట్రీ

బ్రాడ్‌ తన ఫాస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ను 2005లో లీసెస్టర్‌షైర్ తరపున ప్రారంభించాడు. అనంతరం 2008లో నాటింగ్‌హామ్‌షైర్‌కు తన మకంను మార్చాడు. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 264 మ్యాచ్‌లు ఆడిన బ్రాడీ 948 వికెట్లు పడగొట్టాడు. అందులో 20 సార్లు పైగా 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించాడు.

2006లో అరంగేట్రం..
స్టువర్ట్‌ బ్రాడ్‌ 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. సోఫియా గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌పై తన తొలి మ్యాచ్‌ బ్రాడ్‌ ఆడాడు. తన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన బ్రాడ్‌..14 పరుగులిచ్చి 1 వికెట్‌ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. అదే ఏడాది పాకిస్తాన్‌పై టీ20 డెబ్యూ చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్టు పడగొట్టి సత్తా చాటాడు.

ఆ తర్వాత 2007లో టెస్టు క్రికెట్‌లో కూడా బ్రాడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన అరంగేట్రం నుంచి ఇంగ్లీష్‌ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చిన బ్రాడ్‌.. 2016లో వైట్‌బాల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. తన చివరి వన్డే మ్యాచ్‌ 2016లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. అప్పటి నుంచి 37 ఏళ్ల బ్రాడ్‌ కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. తన కెరీర్‌లో కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా కూడా బ్రాడ్‌ వ్యవహరించాడు.

రికార్డుల రారాజు..
17 ఏళ్లు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన బ్రాడ్‌ ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. బ్రాడ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు  166 టెస్టుల్లో 600 వికెట్లు సాధించాడు. అదే విధంగా 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 56 టి20ల్లో 65 వికెట్లు సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లండ్ తరుపున అత్యధిక టెస్టులు ఆడిన రెండో క్రికెటర్‌గా ఉన్నాడు. జెమ్స్‌ అండర్సన్‌ 182 మ్యాచ్‌లతో అగ్ర స్ధానంలో ఉండగా.. బ్రాడ్‌ 166 టెస్టులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్ల పడగొట్టిన ఫాస్ట్‌ బౌలర్ల జాబితాలో బ్రాడ్‌ 600 వికెట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు.

60 పరుగులకే ఆలౌట్‌.. 
2015 యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ తన కెరీర్‌ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో కేవలం 15 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ సంచలన స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా ఆ ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  ఈ మ్యాచ్‌లో బ్రాడ్‌ బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 97 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ కేవలం 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టెస్టుల్లో సెంచరీ..
సాధరణంగా బాల్‌తో ప్రభావితం చూపే బ్రాడ్‌.. 2010లో లార్డ్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో  జరిగిన టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. 8 స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాడ్‌ 169 పరుగులతో అదరగొట్టాడు. ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్‌లో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో 3640 పరుగులు చేశాడు.

డేవిడ్‌ వార్నర్‌కు చుక్కలే..
ఇక బ్రాడ్‌ తన టెస్టు కెరీర్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు చుక్కలు చూపిండాడు. గత కొన్ని ఏళ్ల నుంచి బ్రాడ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి వార్నర్‌ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. బ్రాడ్‌ ఇప్పటి వరకు టెస్టుల్లో డేవిడ్ వార్నర్‌ని 17 సార్లు ఔట్‌ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్‌ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా బ్రాడ్‌ చరిత్ర సృష్టించాడు.

అదొక కాలరాత్రి..
టీ20 ప్రపంచకప్‌-2007లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ బ్రాడ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువరాజ్ సింగ్‌, ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాది బ్రాడ్‌కు కలరాత్రిని మిగిల్చాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన సెడ్జింగ్ కారణంగా యువీ సిక్సర్ల వర్షం కురిపించాడు.
చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్‌


 

Advertisement
 
Advertisement
 
Advertisement