
ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ టోర్నీ రెండో రౌండ్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు కువైట్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మూడో రౌండ్‌కు అర్హత పొందే అవకాశాలు మెరుగవుతాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్న ఈ మ్యాచ్ భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుంది. 2005లో తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఆడిన 39 ఏళ్ల ఛెత్రి ఇప్పటి వరకు 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 94 గోల్స్ సాధించాడు.
జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసియా క్వాలిఫయర్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం ఖతర్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, అఫ్గానిస్తాన్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment