ధోనితో రైనా (PC: BCCI/IPL)
‘‘అప్పుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మా అంకుల్ కుటుంబంలో మరణాలు సంభవించాయి. ఒంటికి నూనె రాసుకుని దాడులకు పాల్పడే కచ్చా గ్యాంగ్.. గ్యాంగ్‌స్టర్స్ వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారు.
అప్పుడు మా బామ్మ కూడా అక్కడే ఉంది. పఠాన్‌కోట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే నేను అక్కడికి వెళ్లాను. అప్పటికే ఐపీఎల్‌లో బయో బబుల్ నిబంధనలు మొదలయ్యాయి.
కాబట్టి తిరిగి జట్టుతో కలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనతో మా నాన్న అప్పటికే నైరాశ్యంలో మునిగిపోయారు. అప్పుడు నాకు నా కుటుంబమే మొదటి ప్రాధాన్యంగా కనిపించింది. క్రికెట్ కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు.
కష్టకాలంలో మాత్రం ఫ్యామిలీకి అండగా ఉండాలని ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ఎంఎస్ ధోని, మేనేజ్‌మెంట్‌కు చెప్పాను. అందుకే జట్టును వీడాను. నేను తిరిగి వచ్చిన తర్వాత 2021 సీజన్ ఆడాను. 2021లో ట్రోఫీ గెలిచాం.
అయితే, అంతకు గతేడాది ముందు మా కుటుంబంలో ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటికే కోవిడ్-19 కారణంగా అందరూ డిప్రెషన్‌లో మునిగిపోయి ఉన్నారు.
అలాంటి సమయంలో ఇలా ఆప్తులను కోల్పోవడం నిజంగా మా అందరినీ కుంగదీసింది. కాబట్టి ఆట కంటే ఫ్యామిలీ వైపే మొగ్గుచూపాను’’ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే జట్టును వీడేందుకు గల కారణాలను తాజాగా లలన్‌టాప్ షోలో వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యానని రైనా చెప్పుకొచ్చాడు.
అయితే, మరుసటి ఏడాది తిరిగి వచ్చిన తర్వాత సీఎస్‌కే మరోసారి చాంపియన్‌గా నిలవడం సంతోషాన్నిచ్చిందని రైనా హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2020లో చెన్నై దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే.
పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి పాయింట్ల పట్టిక(అప్పటికి ఎనిమిది జట్లు)లో ఏడో స్థానంలో నిలిచింది. రైనాతో పాటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విఫలమై పరాభవం మూటగట్టుకుంది.
అయితే, 2021లో విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది సీఎస్‌కే. 2022లో మళ్లీ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానాని(పద్నాలుగు గెలిచినవి నాలుగు)కి దిగజారిన సీఎస్‌కే అనూహ్య రీతిలో గతేడాది ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది.
ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా తన ఐపీఎల్ కెరీర్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన ఆట తీరుతో రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి పొందాడు. అదే విధంగా ‘చిన్న తలా’గా సీఎస్‌కే ఫ్యాన్స్ అభిమానం పొందాడు. కాగా రైనా ధోనికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే.
చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’
Comments
Please login to add a commentAdd a comment