ఒకే ఓవర్‌లో 38 పరుగులు | Surrey Dan Lawrence Scored 38 Runs Of Shoaib Bashir Over In County Cricket, See Details Inside | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్‌లో 38 పరుగులు

Published Tue, Jun 25 2024 11:25 AM | Last Updated on Tue, Jun 25 2024 12:44 PM

Surrey Dan Lawrence Scored 38 Runs Of Shoaib Bashir Over In County Cricket

ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ కౌంటీ క్రికెట్‌లో చెత్త​ రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్‌లో 38 పరుగులు సమర్పించుకుని కౌంటీ క్రికెట్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్‌ వేసిన బౌలర్‌గా ఘోర అపఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-1లో భాగంగా సర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్సెస్టర్‌షైర్‌కు ఆడుతూ ఈ అపవాదును తన ఖాతాలో వేసుకున్నాడు.

బషీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 128వ ఓవర్‌లో సర్రే బ్యాటర్‌ డాన్‌ లార్సెన్‌ తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదాడు. అనంతరం ఆరో బంతికి వైడ్ల రూపంలో ఐదు పరుగులు.. ఆతర్వాతి బంతి నో బాల్‌.. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 38 పరుగులు వచ్చాయి. 

కౌంటీ చరిత్రలో ఓ సింగిల్‌ ఓవర్‌లో ఇన్ని పరుగులు రావడం ఇది రెండోసారి. 1998 సీజన్‌లో అలెక్స్‌ ట్యూడర్‌ కూడా ఓ ఓవర్‌లో 38 పరుగులు సమర్పించుకున్నాడు. నాడు ట్యూడర్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 34 పరుగులు సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సర్రే తొలుత బ్యాటింగ్‌ చేసింది. డాన్‌ లారెన్స్‌ (175) భారీ సెంచరీతో.. డామినిక్‌ సిబ్లీ (76), జేమీ స్మిత్‌ (86), బెన్‌ ఫోక్స్‌ (52) అర్దసెంచరీలతో రాణించడంతో సర్రే తొలి ఇన్నింగ్స్‌లో 490 పరుగులకు ఆలౌటైంది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వార్సెస్టర్‌షైర్‌ రెండో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జేక్‌ లిబ్బీ (61), బెన్‌ అల్లీసన్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement