అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్ రెండో అంచెలో భాగంగా బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 164 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్ సాయంతో మూడు వికెట్లు సాధించడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆపై ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 79 పరుగులు చేయడంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?)
ఆ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌లో భాగంగా 13ఓవర్‌లో కోహ్లి బంతిని చేతితో షైన్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు దిగాడు. అయితే అవేమీ తనకు పట్టవన్నట్లు సూర్యకుమార్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆ క్రమంలోనే కోహ్లికి కాస్త దూరంగా వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తాజాగా ప్రస్తావించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సూర్యకుమార్ ఏ ఒక్కరికో భయపడే రకం కాదనే విషయం కోహ్లి అర్థమై ఉంటుందని ఎద్దేవా చేశాడు. సూర్యకుమార్‌ను కవ్వించడం అంత తేలిక కాదని, అతను ఏ విషయాల్లోనూ పెద్దగా రియాక్ట్ కాడన్నాడు.
‘అదొక అద్భుతమైన మ్యాచ్. అందులో సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. కోహ్లికి తన సత్తా ఏమిటో సూర్యకుమార్ చూపించాడు. (ఆస్ట్రేలియా టూర్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడాన్ని)సెలక్షన్ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా అద్బుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఒక షాట్‌ను కోహ్లి ఉన్న ప్లేస్‌లో ఆడాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌ను రెచ్చగొట్టే యత్నం చేశాడు కోహ్లి. వాటికి భయపడే రకాన్ని కాదనే విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో చెప్పాడు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో చోటు గురించి మాట్లాడుతూ అతనికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశం వస్తుందన్నాడు. ఐపీఎల్ వంటి ఒక లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే వారిలో పలువురు టీమిండియా జట్టులో దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సెహ్వాగ్ ప్రస్తావించాడు. దీనికి వరుణ్ చక్రవర్తే ఒక ఉదాహరణ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment