సాక్షి, విజయనగరం: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వయసును సైతం లెక్క చేయకుండా సాహసం చేశారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ యోగ సాధన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా సాగింది.
జాతీయ స్విమ్మింగ్ పూల్ డే సందర్భంగా మంగళవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో డిప్యూటీ స్పీకర్ జలాసన ప్రక్రియ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
క్రీడల ఆవశ్యకతను తెలుపుతూ డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భావితర క్రీడాకారుల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతుందని.. చైతన్యం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక చైతన్యానికి, ప్రజల ఆరోగ్యానికి ఇలాంటి ప్రక్రియలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ చేపట్టిన సాహసాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
అట్టహాసంగా కార్యక్రమం
కాగా వందలాది మంది ప్రజలు, ఆయన అభిమానులు విచ్చేసి వీక్షించారు. కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజలు, అభిమానుల సౌకర్యార్థం ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సు ఆవరణలో, నగరంలో పలు చోట్ల ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
క్రీడల ప్రాధాన్యతను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం
జలాసనం వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అందుకే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాన్ని చేశానని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, టీవీల మోజులో పడి యువత క్రీడలకు దూరం అవుతున్నారని వాటి ఆవశ్యకతను తెలుసుకొని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వంతుగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ నిత్యం క్రీడా సాధన చేయాలని డిప్యూటీ స్పీకర్ హితవు పలికారు. వయసుతో సంబంధం లేని క్రీడ.. స్విమ్మింగ్ అని దీనిని రోజూ సాధనం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజన్నదొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎం. దీపికా, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment