సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇవాళ (డిసెంబర్ 11) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్వార్టర్ ఫైనల్-3లో సౌరాష్ట్రపై మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందగా.. క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆలుర్ వేదికగా ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్-4 మ్యాచ్ జరుగుతుంది. ముంబైతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బరిలోకి దిగిన విదర్భ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
అథర్వ తైడే (66), అపూర్వ్ వాంఖడే (51) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. శుభమ్ దూబే (43 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ కరుణ్ నాయర్ 26, పార్థ్ రేఖడే 1, కెప్టెన్ జితేశ్ శర్మ 11, మందార్ మహలే 13 పరుగులు చేసి ఔటయ్యారు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో శుభమ్ దూబే, మందార్ మహలే కలిసి 24 పరుగులు పిండుకున్నారు. మొహిత్ అవస్తి వేసిన ఈ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీ వచ్చాయి. అంతకుముందు 19వ ఓవర్‌లోనూ 16 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను సూర్యాంశ్ షెడ్గే వేశాడు. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే, అథర్వ అంకోలేకర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తనుశ్ కోటియన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment