64 బంతుల్లోనే 135 రన్స్‌: 5 వికెట్లతో దుమ్ములేపిన లబుషేన్‌ | T20 Blast: Labuschagne 5-Wicket Haul, Captain Ton Glamorgan Thrash Somerset | Sakshi
Sakshi News home page

T20 Blast: కెప్టెన్‌ సునామీ ఇన్నింగ్స్‌.. లబుషేన్‌ సంచలన ప్రదర్శన

Published Sat, Jul 20 2024 6:25 PM | Last Updated on Sat, Jul 20 2024 7:00 PM

T20 Blast: Labuschagne 5-Wicket Haul, Captain Ton Glamorgan Thrash Somerset

సోమర్సెట్‌ను 120 పరుగుల తేడాతో ఓడించిన గ్లామోర్గాన్‌

Glamorgan vs Somerset: టీ20 బ్లాస్ట్‌ లీగ్‌-2024లో భాగంగా సోమర్సెట్‌తో మ్యాచ్‌లో గ్లామోర్గాన్‌ జట్టు దుమ్ములేపింది. సమిష్టి ప్రదర్శనతో ఏకంగా 120 పరుగుల తేడాతో సోమర్సెట్‌ను చిత్తు చేసింది.

ఇంగ్లండ్‌కు చెందిన ఈ టీ20 లీగ్‌లో భాగంగా సౌత్‌  గ్రూపు జట్లు గ్లామోర్గాన్‌- సోమర్సెట్‌ శుక్రవారం రాత్రి తలపడ్డాయి. కార్డిఫ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గ్లామోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

64 బంతుల్లోనే
ఈ క్రమంలో కెప్టెన్‌, ఓపెనర్‌ కిరాన్‌ కార్ల్‌సన్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు.

అతడి తోడుగా మరో ఓపెనర్‌ విలియమ్‌ స్మాలే(34 బంతుల్లో 59 రన్స్‌) కూడా దంచికొట్టాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇంగ్రామ్‌ 21, వికెట్‌ కీపర్‌ కూకీ 16 రన్స్‌తో ఫర్వాలేదనిపించగా.. బెన్‌ కెల్లావే 5 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన గ్లామోర్గాన్‌ 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్‌కు గ్లామోర్గాన్‌ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.

 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లు
వీరి దెబ్బకు సోమర్సెట్‌ కేవలం 123 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. 13.3 ఓవర్లలోనే ఆలౌట్‌ అయింది. గ్లామోర్గాన్‌ బౌలర్లలో ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లబుషేన్‌ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

కేవలం 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి సోమర్సెట్‌ లోయర్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఇక ఐదు వికెట్ల హాల్‌లో ఒక్కటి మినహా మిగిలిన నాలుగు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్‌ చేయడం ద్వారా వచ్చిన వికెట్లే కావడం విశేషం.

లబుషేన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ వికెట్లు తీసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ఈ సీజన్‌లో సోమర్సెట్‌ ఇప్పటి వరకు 8 విజయాలతో సౌత్‌ గ్రూపులో మూడోస్థానంలో ఉండగా.. గ్లామోర్గాన్‌ విజయాల సంఖ్య తాజాగా ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ జట్టు పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

2003లో ఈ పొట్టి లీగ్‌ మొదలు
కాగా టీ20 బ్లాస్ట్‌ లీగ్‌ను ఇంగ్లండ్‌- వేల్స్‌ క్రికెట్‌ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది. ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ దేశాలు పాల్గొంటాయి. 

వీటిని నార్త్‌, సౌత్‌ గ్రూపులుగా విభజిస్తారు.  మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. తాజా సీజన్‌ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది.

నార్త్‌ గ్రూప్‌ జట్లు
డెర్బీషైర్‌ ఫాల్కన్స్‌, దుర్హాం, లంకాషైర్‌ లైటెనింగ్‌, లీసెస్టర్‌షైర్‌ ఫాక్సెస్‌, నార్తాంప్టన్‌షైర్‌ స్టీల్‌బాక్స్‌, నాట్స్‌ అవుట్‌లాస్‌(నాటింగ్హాంషైర్‌), బర్మింగ్‌హాం బేర్స్‌(విర్విక్‌షైర్‌), వర్సెస్టైర్‌షైర్‌ ర్యాపిడ్స్‌, సార్క్‌షైర్‌ వికింగ్స్‌.

సౌత్‌ గ్రూపు జట్లు
ఎసెక్స్‌ ఈగల్స్‌, గ్లామోర్గాన్‌, గ్లౌసెస్టర్‌షైర్‌, హాంప్‌షైర్‌, కెంట్‌ స్పిట్‌ఫైర్స్‌, మిడిల్‌సెక్స్‌, సోమర్సెట్‌, సర్రే, ససెక్స్‌ షార్క్స్‌.

చదవండి: NCAకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌బై.. కొత్త హెడ్‌ అతడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement