కొన్నిసార్లు ఎలా లాక్ అవుతామో మనకే తెలీదు కదా.. ఉదయం లేచిన దగ్గర్నుంచీ సాయంత్రం పడుకునే వరకూ ఏదో బిజీ. ఈ బిజీ జీవితంలో ఒకటి అనుకుంటే మరొకటి అవుతూ ఉంటుంది. అరే ఆ పని అనుకున్నాం అది కాలేదు.. నిమిషాల్లో అయిపోయే పని కూడా కాలేదే అనుకుంటూ ఒకింత ఆశ్చర్యానికి లోను కావడమే కాకుండా అదే ఆలోచన వైపు కూడా పరుగులు తీస్తాం. ఆపై తలచినదే జరుగుతుందా అని మనకు మనమే సరిపెట్టుకుంటూ ఉంటాం. ఆ సమయాల్లో మనకు మనమే లాక్ అయిపోయినట్లు అనిపిస్తోంది.
రోజులో ఎక్కడో చోట లాక్ అయిపోయి.. వినోదంలో భాగమైన క్రికెట్ మ్యాచ్‌ను చూద్దామనకునే విషయంలో కూడా ఇలా జరిగితే.. అంటే ఫలానా సమయానికి మ్యాచ్ చూద్దామని స్టేడియానికి వచ్చో, లేక టీవీల ముందు కూర్చునో ఆ సమయానికి మ్యాచ్ ఆరంభం కాకపోతే అరే ఏంటిది అనుకుంటాం. సాంకేతిక కారణాల వలనో, వాతావరణం అనుకూలించకో జరిగితే దాని కోసం వెయిట్ చేస్తాం. మరి లగేజ్ రాలేదని మ్యాచ్ షెడ్యూల్ ముందుకు వెళితే.. ఈ మేనేజ్‌మెంట్ నిర్వహణ ఏంటిరా నాయనా.. అని తిట్టుకుంటాం. ఇప్పుడు ఇదే జరిగింది భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌కు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా సోమవారం రెండో టీ20 ఆడాల్సి ఉంది భారత్. అయితే ముఖ్యమైన లగేజ్ సమయానికి రాలేదని భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభమయ్యే మ్యాచ్‌ను పది గంటలకు పొడిగించారు.
ఈ రెండో టీ20 సెయింట్ కిట్స్‌లో జరుగుతుండగా అభిమానులంతా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరొకవైపు మ్యాచ్ అప్‌డేట్స్ కోసం మీడియా కూడా ఆత్రంగానే ఎదురుచూస్తోంది. ఆ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ నుంచి అధికారిక సందేశం విడుదల చేశారు. ‘ట్రినిడాడ్ నుంచి రావాల్సిన ముఖ్యమైన క్రికెటర్ల లగేజ్ ఇంకా సెయింట్ కిట్స్‌కు రాలేదు. ఫలితంగా మ్యాచ్‌ను రెండు గంటల పాటు వెనక్కి జరపకతప్పడం లేదు. దీనికి చింతిస్తున్నాం. అంతా అర్ధం చేసుకోవాలి’ అనే ఒక మెసేజ్ పంపింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. అంటే భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ఆరంభిస్తామనే సంకేతాలు పంపింది.
కాకపోతే ఒక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఈ కారణంతో ఆలస్యం చేస్తారా అనే సందేహం సగటు అభిమానిలో మొదలైంది. అందులోనూ ట్రినిడాడ్‌లో తొలి టీ20 శుక్రవారం జరిగితే రెండో టీ20కి కూడా లగేజ్ రాకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తింది. ఇక్కడ విండీస్ క్రికెట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇక్కడ ఒక పర్యాటక జట్టును కష్టపెట్టడమే కాదు.. ప్రేక్షకుల్లో కూడా విసుగు తెప్పించే పని చేశారు విండీస్ పెద్దలు. ఇది సీరియస్ అంశమే. మ్యాచ్ టైమ్ షెడ్యూల్‌ను లగేజ్ కారణంగా పొడిగించడం అంటే చాలా వాటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న విండీస్ బోర్డుకు మ్యాచ్ ఆలస్యం అంశం మరింత ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. దీనిపై ఇప్పటికిప్పుడు బీసీసీఐ ఏమీ స్పందించకపోయినా దీనిపై పూర్తి వివరణ కోరే అవకాశాలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment