టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-1లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 31) ఆస్ట్రేలియా-ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఐర్లాండ్.. ప్రత్యర్ధికి భారీ స్కోర్ చేసే అవకాశం కల్పించింది. ఐర్లాండ్ బౌలర్లు బ్యారీ మెక్ కార్తీ (3/29), జాషువ లిటిల్ (2/21) మినహా మిగతా వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా పడగొట్టలేకపోవడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా.. మిచెల్ మార్ష్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 25 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ మార్క్ అడైర్ చెత్త బౌలింగ్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో అడైర్.. ఏకంగా 11 బంతులు సంధించి 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 5 వైడ్ బాల్స్ ఉన్నాయి. ఈ ఓవర్ రెండో బంతికి లాంగ్ ఆన్‌లో మెక్ కార్తీ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో సిక్స్ వెళ్లే బంతిని రెండు పరుగులకు మాత్రమే పరిమితం చేయడంతో అడైర్ మరో చెత్త రికార్డు (ఒకే ఓవర్‌లో 30 పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా) నుంచి తప్పించుకున్నాడు. స్టొయినిస్ కొట్టిన ఆ బంతిని మెక్ కార్తీ చాలా దూరం పరిగెట్టి గాల్లో డైవ్ చేస్తూ సిక్సర్ వెళ్లకుండా ఆపగలిగాడు. ఈ ఓవర్‌లో అడైర్.. సిక్స్, 3 ఫోర్లు, 5 వైడ్‌లు, ఓ సింగిల్, ఓ డబుల్ సమర్పించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment