మరికొన్ని రోజుల్లో ఆరంభమయ్యే ఐసీసీ మెగా ఈవెంట్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ ఫేవరెట్ జట్లు ఎలా ఆడబోతాయన్న అంశంపై సోషల్ మీడియా వేదికగా చర్చలు సాగిస్తున్నారు. కాగా అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించేశాయి కూడా.
అక్టోబరు 10 వరకు మార్పులకు చేర్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వివిధ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేస్తున్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో ఎన్ని జట్లు ఆడబోతున్నాయి? మొదటిసారిగా టీ20 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన జట్లు ఏవి? తదితర 5 ఆసక్తికర అంశాలను పరిశీలిద్దాం!
మొత్తం 16 జట్లు...
టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాలాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఒమన్, పపువా న్యూ గినియా, నమీబియా మెగా టోర్నీలో భాగం కానున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
విరాట్ కోహ్లి తొలిసారిగా...
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి... తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రిషభ్ పంత్ తదితర కీలక ప్లేయర్లు భాగస్వామ్యమైన జట్టుకు నేతృత్వం వహించనున్నాడు.
కాగా మిస్టర్ కూల్ ధోని కెప్టెన్సీలో టీమిండియా తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్-2007ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ధోని తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టిన కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2019, ఇటీవలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తదితర ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోని మెంటార్‌గా వ్యవహరించనున్న ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు కోహ్లి ప్రకటించిన విషయం విదితమే.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్.
దుబాయ్‌లో ఇదే మొదటిసారి...
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొలిసారిగా పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ఈ ఈవెంట్ భారత్‌లో జరగాల్సింది. కానీ... కరోనా పరిస్థితుల నేపథ్యంలో అనేక చర్చోపర్చల అనంతరం వేదికను యూఏఈకి మార్చారు.
రెండు కొత్త జట్లు...
నమీబియా, పపువా న్యూ గినియా మొదటిసారిగా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించాయి. ఇదిలా ఉండగా.. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్‌కు నమీబియా జట్టులో చోటు కల్పించడం విశేషం. ఇక ఈ రెండు కొత్త జట్లు సూపర్ 12 స్టేజ్‌లో ఇవి ఏ మేరకు ఆకట్టుకుంటాయనేది మరో ఆసక్తికర అంశం.
నమీబియా టీ20 జట్టు ఇదే..
గెర్హాడ్ ఎరాస్‌మస్(కెప్టెన్), స్టీఫెన్ బార్డ్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, మిచావు డు ప్రీజ్, జాన్ ఫ్రిలింక్, జానే గ్రీన్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, బెర్నార్డ్ షోల్ట్, బెన్ షికాంగో, జేజే స్మిత్, రూబెన్ ట్రంపెల్‌మాన్, మైకేల్‌వాన్ లింగన్, డేవిడ్ వీజ్, క్రెయిగ్ విలియమ్స్, పిక్కీ యా ఫ్రాన్స్.
వేదిక వాళ్లదే.. కానీ పాపం జట్టే లేదు..
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ జరుగనుంది. అయితే, ఈ క్రికెట్ పండుగకు ఆతిథ్యం ఇస్తున్న యూఏఈ జట్టు మాత్రం ఈవెంట్‌లో లేకపోవడం గమనార్హం. గతంలో పొట్టి ఫార్మాట్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ తమ జట్లను బరిలో నిలిపాయి.
సూపర్ 12..
2007- 12 వరకు టీ20 వరల్డ్‌కప్ సెకండ్ రౌండ్‌లో 8 జట్లు మాత్రమే ఉండేవి. వీటిని సూపర్ 8గా వ్యవహరించేవారు. 2014లో ఐసీసీ 10 జట్లకు పెంచింది. ఇక ఈసారి ఏకంగా సూపర్ 12 రౌండ్ నిర్వహించనుంది. క్రికెట్‌ను మరింత విస్తృతం చేసి... మరిన్ని దేశాలను ఇందులో భాగస్వామ్యమయ్యేలా చేసేందుకు ఈ మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
-వెబ్‌డెస్క్
చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్
Comments
Please login to add a commentAdd a comment