T20 World Cup 2021 Afghanistan Vs Namibia Highlights: Afg Beats Nam By 62 Runs - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Afg Vs Nam: అఫ్గన్‌ జోరు.. మరో భారీ విజయం.. ఏకంగా...

Published Mon, Nov 1 2021 7:51 AM | Last Updated on Mon, Nov 1 2021 1:01 PM

T20 World Cup 2021: Afghanistan Beat Namibia By 62 Runs Big Win - Sakshi

Afghanistan Beat Namibia By 62 Runs: టి20 ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్‌ జట్టు తన జోరును కనబరుస్తోంది. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై దాదాపుగా గెలిచినంత పని చేసిన అఫ్గాన్‌... ఈసారి నమీబియాపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. సూపర్‌–12లో భాగంగా గ్రూప్‌–2లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 62 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ ఘనవిజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు మొహమ్మద్‌ షహజాద్‌ (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హజ్రతుల్లా (27 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన అస్గర్‌ అఫ్గాన్‌ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ మొహమ్మద్‌ నబీ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో మెరుపులు మెరిపించారు.

ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు చేసి ఓడింది. హమీద్‌ హసన్‌ (3/9), నవీన్‌ ఉల్‌ హక్‌ (3/26) నమీబియా పని పట్టారు. డేవిడ్‌ వీస్‌ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఓపెనర్ల శుభారంభం 
టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌కు ఓపెనర్లు షహజాద్, హజ్రతుల్లా శుభారంభం చేశారు. ముఖ్యంగా హజ్రతుల్లా ధనాధన్‌ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. వీరి ధాటికి పవర్‌ప్లేలో అఫ్గాన్‌ సరిగ్గా 50 పరుగులకు చేరుకుంది. ప్రమాదకారిగా కనిపించిన హజ్రతుల్లాను స్మిత్‌ పెవిలియన్‌కు చేర్చాడు. మరికాసేపటికే రహ్మనుల్లా (4)కూడా డగౌట్‌కు చేరాడు.

నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్న షహజాద్, నజీబుల్లా జద్రాన్‌ (7) వెంట వెంటనే అవుటవ్వడంతో అఫ్గాన్‌ 150 మార్కును దాటడం కష్టంగా కనిపించింది. అయితే ఈ దశలో జతకలిసిన అస్గర్, నబీ జట్టును ఆదుకున్నారు. భారీ షాట్లతో నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో అఫ్గానిస్తాన్‌ గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. చివరి ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్‌ 51 పరుగులు సాధించింది. 

హడలెత్తించిన నవీన్, హమీద్‌ 
ఛేజింగ్‌ ఆరంభించిన నమీబియాను అఫ్గాన్‌ బౌలర్లు నవీన్‌ ఉల్‌ హక్, హమీద్‌ హసన్‌ హడలెత్తించారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న నవీన్‌ ఇక్కడ కూడా మెరిశాడు. ఓపెనర్లు విలియమ్స్‌ (1), వాన్‌ లింజెన్‌ (11)లతో పాటు జాన్‌ ఫ్రైలింక్‌ (6) వికెట్లను నవీన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. టోరీ్నలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న హమీద్‌ కూడా చెలరేగడంతో నమీబియా లైనప్‌ కకావికలమైంది.

ఎరాస్మస్‌ (12), స్మిత్‌ (0) వికెట్లతో పాటు ఫర్వాలేదనిపించిన డేవిడ్‌ వీస్‌ (26; 2 ఫోర్లు) వికెట్లను హమీద్‌ తీశాడు. వీరిద్దరికి తోడుగా గుల్బదిన్‌ రెండు... రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీసి నమీబియాను 100లోపే కట్టడి చేశారు. కీలక వికెట్లు తీసిన నవీన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో అఫ్గాన్‌ సీనియర్‌ ఆటగాడు అస్గర్‌ అఫ్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

స్కోరు వివరాలు:
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: హజ్రతుల్లా (సి) వాన్‌ లింజెన్‌ (బి) స్మిత్‌ 33; షహజాద్‌ (సి) బెర్నార్డ్‌ (బి) రూబెన్‌ 45; రహ్మనుల్లా (ఎల్బీ) (బి) లోఫ్టీ 4; అస్గర్‌ (సి) వాన్‌ లింజెన్‌ (బి) రూబెన్‌ 31; నజీబుల్లా (ఎల్బీ) (బి) లోఫ్టీ 7; నబీ (నాటౌట్‌) 32; గుల్బదిన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–53, 2–68, 3–89, 4–113, 5–148. బౌలింగ్‌: రూబెన్‌ 4–0–34–2, స్మిత్‌ 3–0–22–1, వీస్‌ 4–0–33–0, ఫ్రైలింక్‌ 3–0–34–0, లోఫ్టీ 4–0–21–2, బెర్నార్డ్‌ 1–0–8–0, ఎరాస్మస్‌ 1–0–7–0. 

నమీబియా ఇన్నింగ్స్‌: విలియమ్స్‌ (సి) (సబ్‌) ఉస్మాన్‌ (బి) నవీన్‌ 1; వాన్‌ లింజెన్‌ (సి) హమీద్‌ (బి) నవీన్‌ 11; లోఫ్టీ (బి) గుల్బదిన్‌ 14; ఎరాస్మస్‌ (బి) హమీద్‌ 12; గ్రీన్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 1; వీస్‌ (బి) హమీద్‌ 26; స్మిత్‌ (సి) షహజాద్‌ (బి) హమీద్‌ 0; ఫ్రైలింక్‌ (సి) నబీ (బి) నవీన్‌ 6; ఫ్రాన్స్‌ (సి) అండ్‌ (బి) గుల్బదిన్‌ 3; రూబెన్‌ (నాటౌట్‌) 12; బెర్నార్డ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–29, 4–36, 5–56, 6–56, 7–69, 8–77, 9–80. బౌలింగ్‌: నవీన్‌ 4–0–26–3, నబీ 2–0–17–0, హమీద్‌ 4–0–9–3, గుల్బదిన్‌ 4–1–19–2, కరీమ్‌ 2–0–11–0, రషీద్‌ ఖాన్‌ 4–0–14–1.

చదవండి: T20 World Cup 2021: వరుసగా రెండో పరాజయం.. ఇక ఇంటికేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement